బాబ్బాబూ.. బస్సులు పంపండి!
– సీఎం సభకు బస్సులు సమకూర్చడంలో ఆర్టీఏ అధికారులు తలమునకలు
– చినబాబు సభ బిల్లులే ఇవ్వలేదంటూ ట్రావెల్స్ యజమానుల అసహనం
అనంతపురం సెంట్రల్ : ఈనెల 2న ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనకు జనాన్ని తరలించేందుకు బస్సులను సమకూర్చేందుకు రోడ్డు రవాణాశాఖ (ఆర్టీఏ) అధికారులు తలమునకలవుతున్నారు. శుక్రవారం సీఎం చంద్రబాబునాయుడు హంద్రీనీవా ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీరు విడుదల చేయడానికి జిల్లాకు రానున్నారు. అనంతరం మడకశిరలో డ్వాక్రా మహిళలతో సమావేశం ఉంటుంది. దీంతో జిల్లా పర్యటన విజయవంతం చేయడానికి టీడీపీ ప్రజాప్రతినిధులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. జిల్లా నలుమూలల నుంచీ జన సమీకరణకు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో బస్సులు సమకూర్చాలని ఆర్టీఏ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు.
అయితే ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పర్యటనకు బస్సులు సమకూర్చారు. నెలలు తిరక్కనే మళ్లీ సీఎం పర్యటన ఉండటంతో బస్సులు సమకూర్చలేక ఆర్టీఏ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల చినబాబు పర్యటనకు సంబందించి వాహనాలు చెందిన బిల్లులు ఇవ్వలేదు. మళ్లీ తాము ఏర్పాటు చేయలేమంటూ కొందరు ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు బాహాటంగానే పేర్కొంటున్నట్లు సమాచారం. ఇటీవల స్వైప్ మిషన్లు ఏర్పాటు విషయంలో ట్రావెల్స్ నిర్వాహకులతో ఆర్టీఏ అధికారులు సమావేశం నిర్వహించారు. దీంతో అధికారులతో కొందరు ట్రావెల్స్ యజమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘వీఐపీలు ఎవరొచ్చినా మమ్మల్ని వాడుకుంటారు.. మా సమస్యలు మాత్రం పట్టించుకోరంటూ’ ఓ నిర్వాహకుడు అధికారి ఎదుట వాపోయారు. ప్రస్తుతం డీజిల్‌కు సంబంధించి కూడా బిల్లులు ఇవ్వకపోవడంతో తమతో కాదని కొందరు చేతులెత్తేస్తున్నారు. బుధవారం సాయంత్రం వరకూ ట్రావెల్స్ నిర్వాహకులతో చర్చలు జరిపితే 10 బస్సులు సమకూరినట్లు తెలిసింది. గురువారంలోపు ఎన్ని బస్సులు సమకూరుతాయో తేలాల్సి ఉంది. అనుకున్న మేరకు సమకూరకపోతే నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సులను మళ్లించే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయం సమాచారం.