టేకోవర్లపై ఇన్ఫోటెక్ దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ మార్చితో ముగిసిన త్రైమాసిక ఆదాయ, నికర లాభాల్లో 28 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలానికి రూ.54 కోట్లుగా ఉన్న నికరలాభం ఇప్పుడు రూ.70 కోట్లకు పెరిగింది. సమీక్షా కాలంలో ఆదాయం రూ.464 కోట్ల నుంచి రూ. 595 కోట్లకు చేరింది. ఏడాది మొత్తం మీద ఇన్ఫోటెక్ రూ.2,206 కోట్ల ఆదాయంపై రూ. 266 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది.
ఆర్థిక ఫలితాలను వెల్లడించడానికి గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్ఫోటెక్ చైర్మన్ బి.వి.ఆర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ కంపెనీ ఆదాయం తొలిసారిగా రూ.2,000 కోట్ల మార్కును అధిగమించిందన్నారు. గడిచిన రెండు త్రైమాసికాల నుంచి వ్యాపారంలో వృద్ధి కనిపిస్తోందని, ఈ ఏడాది కూడా ఇదే విధమైన వృద్ధి కొనసాగే అవకాశం ఉందన్నారు. వాటాదారులకు 60 శాతం (షేరుకు రూ.3) డివిడెండ్‌ను ఇస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీంతో 2013-14 ఆర్థిక సంవత్సరంలో 100 శాతం డివిడెండ్‌ను ఇన్ఫోటెక్ ఇచ్చినట్లయ్యింది.
కుమారుడికి పగ్గాలు
ఇన్ఫోటెక్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డెరైక్టర్‌గా కృష్ణ బోధనపు నియమితులయ్యారు. ఈ మేరకు బోర్డు నిర్ణయం తీసుకుందని, నియామకం తక్షణం అమల్లోకి వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. యువతకి ప్రాధాన్యతనివ్వాలన్న ఉద్దేశ్యంతో తన కుమారుడికి ఈ కీలక బాధ్యతలను అప్పచెప్పామని, ఇక నుంచి తాను కేవలం ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరించనున్నట్లు మోహన్ రెడ్డి తెలిపారు. 2001లో ఇన్ఫోటెక్లో చేరిన కృష్ణ వివిధ హోదాల్లో పనిచేశారు.
గత రెండేళ్ల నుంచి కృష్ణ ప్రెసిడెంట్, సీవోవోగా వ్యవహరిస్తున్నారు. ఇతర కంపెనీలను కొనుగోళ్లు చేయడం ద్వారా వేగంగా విస్తరించే యోచనలో ఉన్నట్లు ఇన్ఫోటెక్ సీఈవో, ఎండి కృష్ణ బోధనపు తెలిపారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా విలేకరులతో మాట్లాడుతూ తమ దగ్గరున్న రూ.726 కోట్ల నగదు నిల్వలను ఉపయోగించి కంపెనీలను కొనుగోళ్ళు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, మెడికల్ డివెసైస్ రంగాలకు చెందిన కంపెనీలతో పాటు ప్రస్తుతం ఉన్న విభాగాలను పటిష్టం చేసే విధంగా ఈ కొనుగోళ్లు ఉంటాయన్నారు. 20 నుంచి 50 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీలపై దృష్టిసారించామని, వచ్చే ఆరు నెలలలోపు ఒక కంపెనీని కొనుగోలు చేయగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.