తమ్ముళ్లూ... ఇది తగునా?
→ డ్రెయినేజీ పనులు అడ్డుకున్న టీడీపీ నేతలు
→ రోడ్డుపైనే మురుగునీటి నిల్వలు
బి.యాలేరు(ఆత్మకూరు, అనంతపురం) : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. కొన్ని రోజులుగా పనులు అర్ధంతరంగా నిలిచి పోవడంతో మురుగునీరంతా రోడ్లపైకి చేరుకుని అసౌకర్యాలకు గురి చేస్తోంది. వివరాల్లోకి వెళితే... మండలంలోని బి.యాలేరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో గతంలో వేసిన సీసీ రోడ్లకు సంబంధించి డ్రెయినేజీలు ఏర్పాటు చేయలేదు. పలుమార్లు అధికారులను, ప్రజాప్రతినిధులను స్థానికులు అభ్యర్థిస్తే జీఆర్జీఎస్ పథకం కింద రూ. 70 వేలు నిధులు మంజూరయ్యాయి. దీంతో పనులను స్థానిక సర్పంచ్ చేపట్టారు. సీసీ రోడ్డు పక్కనే డ్రెయినేజీల ఏర్పాటుకు గుంతలు తీస్తుండగా ఆ గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఆ పనులు చేయడానికి మీరెవరూ అంటూ నిలదీశారు. పనులకు ఎవరు అనుమతిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పనులు అర్ధంతరంగా ఆగిపోయాయని స్థానికులు పేర్కొంటున్నారు.
అసలు సమస్య ఇదే..
బి.యాలేరులోని ఎస్సీ కాలనీలోని ఓ వీధిలో మూడు మినీ వాటర్ ట్యాంక్‌లు ఉన్నాయి. ఆ ట్యాంక్‌ల నుంచి వృధాగా పోతున్న నీరుతో బాటు, కాలనీ వాసుల ఇళ్ల నుంచి వెలువడుతున్న మురికి నీరు రోడ్లపైనే చేరుకుంటోంది. ఈ ప్రవాహం కాస్తా పక్కనే ఆర్డీటీ పాఠశాల నుంచి వెళ్తోంది. డ్రెయినేజీను ఆర్డీటీ పాఠశాలలో ఏర్పాటు చేయరాదని, మరో ప్రాంతం నుంచి కాలువలు ఏర్పాటు చేసుకోవాలంటూ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు సూచిస్తూ పనులు అడ్డుకున్నారు. దీంతో పనులు ఎలా చేయాలో అర్థం కాక మధ్యలోనే నిలిపి వేశారు.
వారే అడ్డుపడుతున్నారు...
కాలనీలో మురుగు కాలువలు ఏర్పాటు చేస్తే చాలా సమస్యలు దూరమవుతాయి. అయితే కాలనీ అభివృద్ధి చెందకుండా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారు. ఆఖరుకు డ్రెయినేజీల ఏర్పాటుకు సైతం తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. – మహేష్, బి.యాలేరు