పెళ్లిచూపులకు వెళ్తూ అనంతలోకాలకు
సాక్షి, సి.బెళగల్: కుమారుడి పెళ్లి చూపులకు వెళ్తూ తండ్రి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన సి.బెళగల్ మండలంలోని కె.సింగవరం గ్రామం వద్ద ఆదివారం చోటు చేకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం యాపనదిన్నె గ్రామానికి చెందిన కుమ్మరి గోరనాథ్ (49), మాణిక్యమ్మకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. గోరనాథ్ తన చిన్న కుమారుడు తిమ్మప్పకు పెళ్లి చూపుల నిమిత్తం ఆదివారం అల్లుడు గోపాల్‌తో కలిసి బైక్‌పై కర్నూలు జిల్లా నందవరం మండలం సోమలగూడూరు గ్రామానికి బైక్‌పై బయలుదేరారు.
రాజోలి, సుంకేసుల, కొత్తకోట గ్రామాల మీదుగా కె.సింగవరం గ్రామ శివారులోకి చేరుకున్నారు. అక్కడ మలుపు వద్ద బైక్ అదుపుతప్పడంతో కర్నూలు డిపో ఆర్టీసీ బస్సు కిందపడి గోరనాథ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అల్లుడు గోపాల్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. సి.బెళగల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివాంజల్ తెలిపారు. కాగా కుమారుడి పెళ్లి చూపులకు బయలుదేరిన తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలుసుకుని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. (చదవండి: తల్లీకుమారుడి దారుణ హత్య)