గుండ్రేవులను పూర్తి చేస్తాం
సి.బెళగల్: గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి తాగు,సాగునీటి అవసరాలు తీరుస్తామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు పాలనలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆయన తెలిపారు. సి. బెళగల్ మండలంలో వివిధ శాఖలకు సంబంధించి నిర్మించిన నూతన భవనాలను సోమవారం కేఈ ప్రారంభించారు. గురుకులంలో మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం జెడ్పీ స్కూల్ ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పారన్నారు. సి.బెళగల్ చెరువును ఎత్తిపోతల పథకం ద్వారా నదినీటితో నింపాలని, జెడ్పీ పాఠశాలకు క్రీడామైదానం మంజూరు చేయాలని ఈ సందర్భంగా స్థానిక ఎంపీటీసీ సభ్యుడు పాండురంగన్న గౌడ్ కోరగా మండల ప్రజలకు అవసరమైన మేరకు అభివృద్ధి పనులు చేపడతామని కేఈ హామీ ఇచ్చారు. గుండ్రేవుల ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చేపట్టి సత్వరమే పూర్తి చేస్తామన్నారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం..
తమ ప్రభుత్వం 24గంటలపాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నట్లు సభలో కేఈ చెప్పిన కొద్దిసేపటికే కరెంట్ పోవడం గమనార్హం. ఈ కారణంగా సభలో ఉన్న జనం నవ్వుకున్నారు. అనంతరం విద్యుత్ అధికారులతో మాట్లాడి కరెంటు సరఫరాకు చర్యలు తీసుకున్నారు. మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గోవిందు గౌడ్, ఎంపీపీ నాగమనెమ్మ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
విష్ణువర్గం దూరం..
కోడుమూరు టీడీపీ ఇన్చార్జ్ విష్ణువర్ధన్‌రెడ్డి వర్గం సోమవారం కేఈ పర్యటనకు దూరంగా ఉండిపోయింది. ఈ పరిస్థితి పార్టీలో వర్గ విభేదాలను బహిర్గతం చేసింది. విష్ణువర్గానికి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు చంద్రశేఖర్ కూడా కేఈ కార్యక్రమాలకు హాజరు కాలేదు. దీనిపై ఆయన వివరణ ఇస్తూ కేఈ పర్యటనపై అధికారులు, మండల టీడీపీ నాయకులు తనకు సమాచారం ఇవ్వలేదని తెలిపారు.