C R Rao: తెలుగోడికి స్టాటిస్టిక్స్ నోబెల్ అవార్డు, 102 ఏళ్ల వయసులో ఘనత
ప్రపంచ ప్రఖ్యాత గణాంకశాస్త్ర నిపుణుడు, భారతీయ అమెరికన్ కల్యంపూడి రాధాకృష్ణరావు (102) స్టాటిస్టిక్స్ రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. గణాంక శాస్త్ర రంగంలో నోబెల్ అవార్డుగా భావించే ఇంటర్నేషల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అవార్డు సీఆర్ రావును వరించింది.
సాధించడానికి వయస్సుతో పని లేదని నిరూపించిన గొప్ప వ్యక్తి సీఆర్ రావు. వయస్సు అనేది కేవలం ఒక నెంబర్ అని మాత్రమే చెప్పే.. రాధాకృష్ణారావు.. జీవితంలో ఎన్నో సాధించి ఐకాన్‌గా నిలిచారు. 62 ఏళ్లకు కూతురి దగ్గర ఉండేందుకు అమెరికా వెళ్లిన రావు, 70 ఏళ్ల వయస్సులో పిట్స్బర్గ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేరారు.
ఆయనకు 75 ఏళ్లున్నప్పుడు అమెరికా ప్రభుత్వం పౌరసత్వం ఇచ్చింది. 82 ఏళ్ల వయస్సులో రావు వైట్ హౌజ్ ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్ మెడల్ ఫర్ సైన్స్ అవార్డు అందుకున్నారు. 102 ఏళ్ల వయస్సులో స్టాటిస్టిక్స్ నోబెల్ అందుకుంటున్నారు.
సీఆర్ రావు 1920 సెప్టెంబరు 10న బళ్లారి జిల్లా హడగళిలోని తెలుగు కుటుంబంలో పుట్టారు. ఏపీలోని గూడూరు, నూజివీడు, నందిగామల్లో చదువుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎమ్మెస్సీ మ్యాథ్స్, కోల్‌కతా యూనివర్సిటీలో ఎంఏ స్టాటిస్టిక్స్ చేశారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని కింగ్స్ కాలేజీలో 1948లో పీహెచ్డీ పూర్తి చేశారు.
(చదవండి: ‘మహా’ రాజకీయాల్లో మరో ట్విస్ట్.. అజిత్‌ను కలిసిన ఉద్ధవ్)
ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో విద్యార్థిగా చేరి అదే సంస్థకు డైరెక్టర్‌గా ఎదిగారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసిన అనంతరం అమెరికాలో స్థిరపడిన ఆయన ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ బఫెలోలో రీసెర్చ్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు.
కలకత్తా మ్యాథమెటికల్ సొసైటీలో ప్రచురితమైన సీఆర్ రావు పరిశోధన పత్రానికిగాను ఈ అవార్డు దక్కింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ అవార్డును అందజేస్తారు. 2019లో అమెరికాకు చెందిన ప్రొఫెసర్ బ్రాడ్లీ ఎఫ్రాన్, 2021కి అమెరికాకు చెందిన ప్రొఫెసర్ Emerita Nan Laird లకు అందజేశారు.
(చదవండి: భార్యాపిల్లల గుర్తుగా చేసిన పనికి.. రూ. 90 కోట్లు అదృష్టం వరించింది!)
2023కి సీఆర్ రావుకు అవార్డు అందనుంది. భారత స్టాటిస్టిక్స్ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ప్రొఫెసర్ రావును భారత ప్రభుత్వం 1968లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది.