పదవుల పందేరం
► నేడు చర్చించనున్న కేపీసీసీ చీఫ్, సీఎం
► 72 కార్పొరేషన్లకు అధ్యక్షులు, 14 మండళ్లకు ఉపాధ్యక్షులను నియమించే అవకాశం
► 20 మంది ఎమ్మెల్యేలకు దక్కనున్న అధ్యక్ష పదవులు
బెంగళూరు : రాష్ట్రంలోని కార్పొరేషన్లు, బోర్డులకు అధ్యక్షుల నియామకానికి ముహూర్తం దగ్గర పడుతుండడంతో ఆశావహుల మధ్య పోటీ ఎక్కువవుతోంది. సోమవారమే దీనిపై ముఖ్యమంత్రి కసరత్తు చేసినప్పటికీ, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర తుమకూరు పర్యటనలో ఉన్నందున, ఆయనతో చర్చించే అవకాశం లేకుండా పోయింది. బుధవారం ఉభయులూ దీనిపై తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 72 కార్పొరేషన్లు, మండళ్లకు అధ్యక్షులను నియమించాల్సి ఉంది. 14 మండళ్లకు ఉపాధ్యక్షులను కూడా నియమించే అవకాశం ఉంది. మొత్తమ్మీద 650 మంది డెరైక్టర్లను కూడా నియమించాల్సి ఉంటుంది. 20 మంది ఎమ్మెల్యేలకు అధ్యక్ష పదవులు వరించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
తొలుత ఎమ్మెల్యేలకు ఈ పదవులను కట్టబెట్టరాదని పార్టీలో వాదనలు వినిపించినప్పటికీ, మంత్రి వర్గ విస్తరణ సందర్భంగా ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఎమ్మెల్యేల్లో కొందరికైనా అవకాశం కల్పించక తప్పదని సీఎం నచ్చజెప్పగలిగారు. మొత్తమ్మీద 70 శాతం పదవులు పార్టీ నాయకులు, కార్యకర్తలకు, 30 శాతం పదవులను ఎమ్మెల్యేలకు కట్టబెట్టాలని నిర్ణయించారు. తుది జాబితా సిద్ధమయ్యాక అధిష్టానం అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నెలాఖరుకు నియామకాల తంతును ముగించాలని సీఎం భావిస్తున్నారు.