కేంద్ర మంత్రివర్గ సమావేశం రద్దు
సాక్షి, ఢిల్లీ: మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం నేపథ్యంలో ఉదయం 11 గంటలకు జరగాల్సిన కేంద్ర మంత్రివర్గ భేటీ రద్దు అయ్యింది. కాగా, యువ రక్తంతో కేంద్ర కేబినెట్ కొత్త రూపు సంతరించుకోనుంది. మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. బుధవారం సాయంత్రం కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మోదీ నేతృత్వంలో ఎన్డీయే రెండోసారి కొలువు దీరి రెండేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో పాలనను మరింత పటిష్టం చేసేందుకు మొదటిసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. అలాగే 2022 మార్చిలో గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల శాసనసభ కాలపరిమితి, అలాగే, 2022 మే నెలలో ఉత్తరప్రదేశ్ శాసనసభ కాలపరిమితి ముగియనుంది.
మంత్రివర్గ విస్తరణలో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకోనున్నారు. అలాగే, యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కనుంది. ఇప్పటికే సీనియర్ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్‌ను మంత్రిమండలి నుంచి తప్పించి కర్నాటకకు గవర్నర్‌గా పంపించారు. ఇప్పుడున్న మంత్రుల్లో మరి కొందరు కూడా తమ పదవులను కోల్పో నున్నట్టు తెలుస్తోంది. అలాగే, కొందరి శాఖల్లోనూ మార్పులు చోటు చేసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గంలో మార్పుల ప్రకటనకు ముందే, బుధవారం ప్రధాని అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఉంటుందని తెలిపాయి.