చాక్లెట్ కనుమరుగు?
సాక్షి, వెబ్డెస్క్ : పిల్లలు మారం చేసినప్పుడు పెద్దలు చెప్పే మాట.. అల్లరి చేయకు నీకు చాక్లెట్ కొనిపెడతా అని. భవిష్యత్లో ఈ మాటను మనం వినలేకపోవచ్చు. అందుకు కారణం చాక్లెట్ను ఉత్పత్తి చేసే కకోవా చెట్లు వేడి వాతావరణంలో బతకడానికి ఇబ్బంది పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
పరిస్థితి ఇలానే కొనసాగితే మరో 40 సంవత్సరాల్లో చాక్లెట్ చరిత్రపుటల్లో కలిసిపోతుందని హెచ్చరించారు. చాక్లెట్ను ఉత్పత్తి చేసే కకోవా చెట్లు భూమధ్య రేఖ పరిసర ప్రాంతాల్లో 20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద పెరుగుతాయి. కకోవా చెట్లు వేగంగా ఎదగడానికి తేమ, అధిక వర్షపాతం అవసరం.
అయితే, వచ్చే 30 ఏళ్లలో గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూమి సగటు ఉష్ణోగ్రత దాదాపు 2.1 డిగ్రీలు పెరుగనుందని అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ పాలన సంస్థ పేర్కొంది. దీని వల్ల చాక్లెట్ పరిశ్రమకు కోలుకోలేని నష్టం కలుగుతుందని చెప్పింది. 2050 వరకూ అయినా కకోవా చెట్లను బ్రతికించుకోవాలంటే వాటిని కొండ ప్రాంతాల్లో పెంచాల్సివుంటుందని తెలిపింది.
కకోవా చెట్లపై వాతావరణ మార్పు ప్రభావం చూపడం ప్రారంభమైన దగ్గర నుంచి ప్రపంచ దేశాల్లో మథనం ప్రారంభమవుతుందని పేర్కొంది. ప్రపంచంలో సగం చాక్లెట్ను ఉత్పత్తి చేస్తున్న ఐవరీ కోస్ట్, ఘనా దేశాలు ఈ సంక్షోభానికి తలకిందులవుతాయని చెప్పింది. చాక్లెట్ ఉత్పత్తిని ఆపాలా? లేక చనిపోతున్న కకోవాలను కాపాడుకోవాలా అన్న డైలమా ఆ దేశాలను అతలాకుతలం చేస్తుందని వెల్లడించింది.