నీట్ ఉద్యమం
♦ రాష్ట్రంలో ‘నీట్’ మినహాయింపునకు పట్టు
♦ మానవహారానికి డీఎంకే పిలుపు
♦ పోలీసుల అనుమతి నిరాకరణ
♦ ప్రతిపక్షాలన్నీ మళ్లీ ఏకమై నిరసన
♦ సేలంలో స్టాలిన్ అరెస్టు
♦ రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తత
‘నీట్’ మినహాయింపునకు పట్టుబడుతూ ఉద్యమించేందుకు ప్రతిపక్షాలు మళ్లీ ఏకమయ్యాయి. నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించి గురువారం సాయంత్రం మానవహారంతో కదంతొక్కాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినదించాయి. మానవ హారంలో పాల్గొనేందుకు వెళ్తున్న డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ను పోలీసులు ఉదయాన్నే అరెస్టు చేయడంతో ఆ పార్టీ వర్గాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
సాక్షి, చెన్నై : వైద్య కోర్సులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష తమిళ విద్యార్థుల్ని సంకట పరిస్థితుల్లోకి నెట్టిన విషయం తెలిసిందే. నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని పట్టుబడుతూ అసెంబ్లీలో తీసుకొచ్చిన తీర్మానం ఢిల్లీలో తుంగలో తొక్కారు. ఈ తీర్మానం ఆమోదించాలని, నీట్ మినహాయింపు ఇవ్వాలని నినదిస్తూ డీఎంకే నేతృత్వంలో మానవహారానికి పిలుపునిచ్చారు. దీన్ని వ్యతిరేకిస్తూ, కోర్టుల్లో పిటిషన్లు సైతం దాఖలయ్యాయి. ఈ మానవహారానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఉత్కంఠ తప్పలేదు. నిషేధం ఉల్లంఘించైనా మానవహారం నిర్వహించేందుకు డీఎంకే వర్గాలు నిర్ణయించాయి. ఇందుకు కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మద్దతు ఇవ్వడంతో ఉత్కంఠ తప్పలేదు.
స్టాలిన్ అరెస్టుతో ఉత్కంఠ
సేలం కచ్చరాయన్ చెరువు పూడికతీత వివాదాస్పదం కావడంతో గురువారం ఉదయాన్నే అక్కడ పర్యటించి, సాయంత్రం మానవహారంలో పాల్గొనేందుకు స్టాలిన్ నిర్ణయించారు. అయితే, కచ్చరాయన్ చెరువు వైపుగా అనుమతించబోమని స్టాలిన్‌కు సేలం జిల్లా పోలీసు యంత్రాంగం హెచ్చరికలు చేసింది. అయినా, ఆయన కోయంబత్తూరు మీదుగా సేలంకు బయలుదేరారు. మార్గం మధ్యలో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తప్పలేదు.
అరగంట పాటుగా స్టాలిన్ వాహనం రోడ్డు మీదే ఆగడం, డీఎంకే వర్గాలు వేలాదిగా తరలిరావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్టాలిన్‌ను పోలీసులు అడ్డుకున్న సమాచారంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠకు దారితీసింది. సేలం జిల్లాలో అయితే, కొన్నిచోట్ల డీఎంకే వర్గాలు బస్సుల మీద తమ ప్రతాపం చూపించడంతో ఆందోళనకారుల్ని అడ్డుకోవడం పోలీసులకు శ్రమగా మారింది. ఎక్కడికక్కడ డీఎంకే వర్గాలు ఆందోళనకు దిగాయి. అయితే, తాను అరెస్టు అవుతున్నట్టు, ఎవరూ ఎలాంటి ఆందోళనలు చేయవద్దు అని, సాయంత్రం జరగాల్సిన మానవహారం విజయవంతం చేయాలని స్టాలిన్ పిలుపునివ్వడంతో డీఎంకే వర్గాలు శాంతించాయి.
మానవ హారం
స్టాలిన్‌తోపాటుగా సేలం జిల్లా డీఎంకే వర్గాలందర్నీ పోలీసులు అరెస్టు చేయడంతో అక్కడ మాత్రం మానవహారం జరగలేదు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే వర్గాలతో కలిసి, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కేడర్ మానవహారంలో నీట్ మినహాయింపు పట్టుబడుతూ నినదించింది. చెన్నైలో పలుచోట్ల డీఎంకే ఎమ్మెల్యేల నేతృత్వంలో మానవహారాలు జరగ్గా, పోలీసులు అడ్డుకున్నారు.
మానవహారాన్ని అడ్డుకునే రీతిలో మరికొన్నిచోట్ల పోలీసులు దూకుడు ప్రదర్శించారు. సాయంత్రం పోలీసులు స్టాలిన్‌ను విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నీట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు నాల్కల ధోరణి అనుసరిస్తోందని ధ్వజమెత్తారు. కేంద్రం కాళ్ల మీద పడి శరణు కోరిన ఈ పాలకులు, తమ మీద ఉన్న కేసుల నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తున్నారేగానీ, ప్రజాహితాన్ని కాంక్షించడం లేదని మండిపడ్డారు. నీట్ మినహాయింపునకు పట్టుబడుతూ పోరాటం మరింత ఉధృతం కాబోతుందని ప్రకటించారు.