కాపు మంత్రులకు అత్యవసర పిలుపు
కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండుతో మొదలైన కాపు గర్జన ఉన్నట్టుండి ఉద్రిక్తంగా మారడంతో.. పరిస్థితిపై సమీక్షించేందుకు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం విజయవాడలో సోమవారం జరగబోతోంది. అందుబాటులో ఉన్న మంత్రులతో పాటు కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హుటాహుటిన విజయవాడ రావాలని తెలిపారు. ప్రస్తుతం ఏపీ కేబినెట్లో నలుగురు కాపు మంత్రులు ఉన్నారు. నిమ్మకాయల చినరాజప్ప, నారాయణ, గంటా శ్రీనివాసరావు, పైడికొండల మాణిక్యాలరావు.. ఈ నలుగురితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రావాలని సమాచారం పంపినట్లు తెలుస్తోంది.
సోమవారం సాయంత్రంలోగా కాపులను బీసీల్లో చేరుస్తూ జీవో విడుదల చేయాలని, లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ముద్రగడ పద్మనాభం ఇప్పటికే అల్టిమేటం ఇచ్చారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అత్యవసరంగా కేబినెట్ భేటీ పెడుతున్నారు. ఉద్యమం ఈ స్థాయిలో ఉండగా నియంత్రించడం సాధ్యం కాదని అందరికీ అర్థమైంది. కానీ మరోవైపు.. టీడీపీలోని బీసీ మంత్రులు కూడా కాపు రిజర్వేషన్లను వ్యతిరేకించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక తల పట్టుకుంటున్నారు. కొత్త బడ్జెట్లో బీసీ కమిషన్కు భారీ మొత్తంలో నిధులు కేటాయించి వారిని సమాధానపరచాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.