అధికారుల నిర్లక్ష్యం.. అవస్థలే సమస్తం
చామలపల్లి (చండూరు) : సాక్షాత్తూ సీఎం చెప్పినా ఆ మాటలు మాకు కాదనుకున్నారేమో గానీ ఆ అధికారులు పట్టించుకోలేదు. కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పడి ముచ్చటగా మూడు వారాలు కావొస్తోంది. దసరా ముందు రోజే పంపాల్సిన రికార్డులను నేటికీ పంపలేదు. ఫలితంగా పాలనలో స్తబ్దత నెలకొంది. నాంపల్లి, చండూరు మండల శాఖాధికారుల నిర్లక్ష్యం మూలంగా మూడు రెవెన్యూ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన జిల్లాల, మండలాల విభజనలో అధికారులు ఏమరపాటుగా ఉండడంతో ఆ గ్రామం ఏ మండలం కిందుందో తెలియక ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. దీంతో చామలపల్లి గ్రామస్తులు ప్రభుత్వ పాలనను అందుకోలేకపోతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల నిమిత్తం ఏ మండలానికి వెళ్ళాలో తెలియక తికమక పడుతున్నారు.
ప్రభుత్వం పాలన సౌలభ్యం కోసం దసరా సందర్భంగా జిల్లాల, మండలాల విభజనకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే నాంపల్లి మండలం పరిధిలోని చామలపల్లి గ్రామాన్ని చండూరు మండలంలో విలీనం చేసింది. ఇదంతా ఒక ఎత్తై ఆనాటి నుంచి ఏదైనా పని కోసం నాంపల్లి మండల శాఖ అధికారుల దగ్గరకు వెళ్తే తమకేం సంబంధం లేదని సమాధానమిస్తున్నారు. మరోవైపు చండూరుకు వెళ్తే రికార్డులు ఇంకా అందలేదనే సాకులు చెప్తుండడంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. మా గ్రామానికి ఏ మండలం అధికారులు సేవలు అందిస్తారో చెప్పండని ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నారు. నిత్యం వివిధ పనుల నిమిత్తం విద్యార్థులు, రైతులు రెండు మండలాల అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు.
అసలేం జరుగుతుందటే..
దసరా రోజు నాంపల్లి మండలం నుంచి చామలపల్లి గ్రామాన్ని చండూరులో కలుపుతున్నట్లు అధికారులకు ప్రభుత్వం నుంచిఉత్తర్వులు అందాయి. 13 రోజు లుగా ఆ గ్రామానికి చెందిన రికార్డులను చండూరు మండల శాఖాధికారులకు పంపించడంలో నాంపల్లి మండల శాఖల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అదిగో.. ఇదిగో అంటూ నాంపల్లి మండల అధికారులు అంటూ కాలయాపన చేస్తుండడంతో ఈ సమస్య ఉత్పన్న మైంది.
అధికారుల తప్పిదంతోనే ఇలా..
ఇదిలావుంటే దీనికితోడు మరో సమస్య ఉత్పన్నమవుతుంది. అదెంటంటే చామలపల్లి గ్రామ పంచాయతీని చండూరు మండలం లో విలీనం చేస్తున్నట్లు నాంపల్లి మండల శాఖాధికారులు గతం లో ప్రభుత్వానికి నివేదిక అందించారు. కానీ పం చాయతీకి బదులుగా మూడు రెవిన్యూ గ్రామాలని నివేదిక అందిస్తే ఆ గ్రామ పంచాయతీకి ఆవాస గ్రామాలైన కుందేలు తిరుమలగిరి, గానుగుపల్లి సైతం మండలం చేరేవి. ఇలా కాకుండా ఒక్క చామలపల్లి గ్రామపంచాయతీ పేరుతో నివేదిక పంపడంతో మిగతా రెండు ఆవాస గ్రామాల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. అధికారులు చేసిన పొరపాటు ఫలితంగా ఆయా గ్రామాల ప్రజలు నానాఅవస్థలు ఎదుర్కొంటున్నారు. రెండు ఆవాస గ్రామాలు చామలపల్లికి లేకపోతే జనాభా పరంగా అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. గానుగుపల్లి దాటే చామలపల్లికి పోవల్సిఉంది. ఇదంతా చూస్తుంటే చిన్న తప్పిదం కాస్త పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.