సౌదీ ఎడారిలో అద్భుతం..!
రియాద్, సౌదీ అరేబియా : దాదాపు 2 వేల ఏళ్ల క్రితం రాతిపై చిత్రించిన అరుదైన ఒంటె చిత్రాలను సౌదీ అరేబియా ఎడారిలో పరిశోధకులు కనుగొన్నారు. వాస్తవానికి సౌదీ అరేబియాలో ఇలాంటి చిత్రాలు లభ్యకావడం కొత్తేమీ కాదు. అయితే, ఈ సారి పరిశోధకులు కనుగొన్న ఒంటెల చిత్రాలు భారీ ఆకారంలో ఉన్నాయి.
ఒకే ప్రాంతంలో దాదాపు 12 ఒంటెల చిత్రాలు ఉన్నాయని, ఇలా ఒకే చోట ఇన్ని చిత్రాలు ఉండటం అరుదని చెప్పారు. కొన్ని చిత్రాలను పూర్తిగా చెక్కకుండా వదిలేసినట్లు వెల్లడించారు. బహుశా ఈ ప్రదేశం నుంచి ప్రార్థనలు చేయడం వల్ల ఈ చిత్రాలను చెక్కి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అరేబియన్ రాక్ ఆర్ట్‌లో పెయింటింగ్, శిలలపై చెక్కడానికి చాలా ప్రాధాన్యత ఉందని తెలిపారు. ముఖ్యంగా యుద్ధం, వేట, జంతువులకు సంబంధించిన బొమ్మలను రాక్ ఆర్ట్‌లో భాగంగా పూర్వకాలపు అరేబియన్లు చిత్రించేవారని వివరించారు.
సౌదీ అరేబియా - రాక్ ఆర్ట్ :
అరేబియా పెనిసులాపై ఒకే మిలియన్ సంవత్సరాల క్రితమే మనిషి నివసించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. సౌదీ అరేబియాలో 4 వేల రిజిస్టర్డ్ ఆర్కియలాజికల్ సంస్థలు ఉండగా.. అందులో 1500 రాక్ ఆర్ట్‌పై పరిశోధనలు చేస్తున్నాయి. అందుకు కారణం రాక్ ఆర్ట్‌కు సౌదీ అరేబియన్లు ఇచ్చిన ప్రాధాన్యమే.
10 వేల నుంచి 8 వేల సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాలో జంతువుల చిత్రాలను రాళ్లపై చిత్రించడం మొదలైంది. ముఖ్యంగా ఆవులు, ఒంటెలు, కుక్కల చిత్రాలు సౌదీ అరేబియా చారిత్రక ప్రదేశాల్లో కనిపిస్తాయి.