ఎడారి జీవికి ఎసరొచ్చింది!
జైపూర్ : ఎడారి జీవికి ఎసరొచ్చింది. ప్రకృతి సమతుల్యతకు, భౌగోళిక భిన్నత్వానికి ప్రతీకలైన జీవుల ఉనికి ప్రశ్నార్థకమవుతోంది. ఒంటెల అక్రమ వర్తకంతో ఎడారిలో వీటి సంఖ్య కనుమరుగవుతోంది. మాంసం కోసం వధించేందుకు ఒంటెలను తరలిస్తుండటంతో రాజస్ధాన్ రాష్ట్ర జంతువు మనుగడ ప్రమాదంలో పడింది. వధించేందుకు ఒంటెలను అక్రమంగా తరలిస్తున్న ఫలితంగా రాష్ట్రంలో ఒంటెల జనాభా కుచించుకుపోతోందని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్‌లో ఎనిమిది లక్షలుగా ఉన్న ఒంటెల సంఖ్య ప్రస్తుతం రెండు లక్షలకు పడిపోయింది.
2016లో ఒంటెను రాష్ట్ర జంతువుగా గుర్తించినా ఒంటెలు అంతరించే పరిస్థితి కొనసాగుతోంది. ఇటీవల బార్మర్ నుంచి ఒంటెలను తరలిస్తున్న ట్రక్కు పట్టుబడటంతో ఒంటెల స్మగ్లింగ్ విశృంఖలమవుతుండటం వెలుగులోకి వచ్చింది. వ్యవస్థీకత స్మగ్లింగ్ నెట్వర్క్ గుట్టును చేధించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఒంటెల అక్రమ వర్తకం గుట్టుమట్లను కనిపెట్టేందుకు విచారణ జరుగుతోంది, ఏ స్ధాయిలో ఈ దందా సాగుతున్నదో కూపీ లాగుతామని బార్మర్ ఎస్పీ మనీష్ అగర్వాల్ వెల్లడించారు. బార్మర్, జైసల్మీర్, జోథ్‌పూర్, బికనీర్, చురు, నాగౌర్ ప్రాంతాల నుంచి ఒంటెలను సేకరించి పశువల సంతల్లో అక్రమంగా విక్రయిస్తున్నారని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అల్వార్, భరత్పూర్ జిల్లాల మీదుగా రోడ్డు మార్గం ద్వారా రాష్ట్ర సరిహద్దుల్లో ఒంటెల స్మగ్లింగ్ సాగుతోందని జంతు ప్రేమికులు చెబుతున్నారు.