అరుదైన శిశువు జననం
హైదరాబాద్ : ఛాతీపై స్పందిస్తున్న గుండెతో నవజాత శిశువు జన్మించింది. ఈ సంఘటన సోమవారం హైదరాబాద్‌లోని చంపాపేటలో చోటుచేసుకుంది. చంపాపేట డివిజన్ సామ నర్సింహారెడ్డి కాలనీకి చెందిన ఓ మహిళ మొదటిసారిగా గర్భం దాల్చింది. స్థానిక కృష్ణసాయి మెటర్నిటీ ఆసుపత్రిలో ఐదవ నెలలో వైద్యులు ఆమెకు టిప్ఫా (గర్భంలో వున్న శిశువు ఎదుగుదల నిర్ధారణ కోసం చేసే పరీక్ష) పరీక్ష చేయగా కవలలు ఉన్నట్లు తేలింది. అందులో ఒక బేబి పూర్తి స్థాయిలో ఆరోగ్యంతో ఉండగా రెండవ బేబి శరీరం పైభాగంలో వేలాడుతున్న గుండె, గ్రహణం మొర్రితో ఉన్నట్లు వైద్యులు నిర్ధారించి, గర్భంలో ఆ శిశువు ఎదుగుదల వల్ల మొదటి బేబీకి, తల్లి ప్రాణానికి కూడా ప్రాణాపాయం ఉండవచ్చనే విషయాన్ని గర్భిణికి తెలిపారు. గర్భస్రావం చేయించుకోవడం ఇష్టం లేక ఆమె నవమాసాలు మోసేందుకే నిర్ణరుుంచుకుంది. తొమ్మిది నెలలు నిండడంతో ఈ నెల 6న ఆసుపత్రిలో చేరింది.
ఆదివారం రాత్రి ఆసుపత్రి గైనకాలజిస్టు మందడి అపర్ణ, సివిల్ సర్జన్ దుర్గాప్రసాద్ నేతృత్వంలో ఆమెకు శస్త్రచికిత్స చేసి కవల బాబులను బయటికి తీశారు. అందులో ఒక బాబు 2.9 కిలోల బరువుతో ఆరోగ్యంగా వుండగా రెండవ బాబు 2.1 కేజీతో ఆరోగ్యంగా వున్నప్పటికీ శరీరం బయట వేలాడుతున్న గుండె, గ్రహణం మొర్రితో జన్మించడంతో వెంటనే ఆ పసికందును వైద్యుల సలహా మేరకు నీలోఫర్‌కు తరలించారు. ప్రస్తుతం తల్లి, మొదటి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇలాంటి అరుదైన జననం 20 లక్షల మందిలో ఒకరికి మాత్రమే సంభవిస్తుందని వైద్యులు పేర్కొన్నారు.