Campus Ambassador
-
క్యాంపస్ అంబాసిడర్ - పి. నరహరి- ఐఐఎం - ఇండోర్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) - ఇండోర్. మధ్యప్రదేశ్‌లో ఉన్న ఈ సంస్థ.. ఏ ఐఐఎంలోనూ లేని ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌ను ఇంటర్మీడియెట్ అర్హతతోనే అందిస్తోంది. ఇక్కడ సెకండియర్ పీజీపీ చదువుతున్న పాయల నరహరి.. ఆరుగురు విద్యార్థులు మాత్రమే ఉండే ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. స్పోర్ట్స్ కమిటీ సెక్రటరీగా కూడా ఉన్న ఆయన తన క్యాంపస్ లైఫ్‌ను పంచుకుంటున్నారిలా... క్యాంపస్ అద్భుతం మా ఊరు చిత్తూరు జిల్లాలోని పాయలవారిపల్లి. క్యాంపస్.. దాదాపు 200 ఎకరాల్లో ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్పరంగా.. ఆడిటోరియం, లైబ్రరీ, క్యాంటీన్, హాస్టళ్లు, ల్యాబ్ లు, ప్లే గ్రౌండ్స్, ఇంక్యుబేషన్ సెంటర్ అత్యుత్తమ స్థాయిలో ఉంటాయి. రెండేళ్లకు కలిపి కోర్సు ఫీజు రూ.15 లక్షలు. ప్రతి రోజూ ఉదయం 8.45 నుంచి రాత్రి 11.30 వరకు క్లాసులు, ఇండస్ట్రియల్ లెక్చర్లు, ప్రాజెక్టులు, గ్రూప్ డిస్కషన్స్.. ఇలా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటాం. ఇండస్ట్రీ విజిట్స్, లైవ్ ప్రాజెక్టులు రెండేళ్ల పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్లో భాగంగా.. మొదటి ఏడాది అందరికీ కామన్‌గా ఉంటుంది. రెండో ఏడాదిలో ఎన్నో ఎలక్టివ్స్ అందుబాటులో ఉంటా యి. గవర్నెన్స్, స్ట్రాటజీ, ఆపరేషన్స్, ఫైనా న్స్.. ఇలా ఎన్నింటినో ఎంచుకోవచ్చు. భవిష్యత్తులో ఒక కంపెనీ మేనేజర్‌కు కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్, నాయకత్వ నైపుణ్యాలను నేర్పిస్తారు. కోర్సులో భాగంగా ఇండస్ట్రీ విజిట్స్, లైవ్ ప్రాజెక్టులు ఉంటాయి. కేస్ స్టడీస్‌కు ఎక్కువ ప్రాధాన్యం అసైన్మెంట్లు, ప్రాజెక్టులు, గ్రూప్ డిస్కషన్స్ కోర్సులో భాగంగా ఉంటాయి. లెక్చర్తోపాటే ఆయా అంశాలపై విద్యార్థులు తమ అభిప్రాయాలను ఒకరితో ఒకరు పంచుకుంటారు. ఎక్కువగా వివిధ కంపెనీల పరాజయాలను కేస్ స్టడీస్‌గా ఎంచుకుంటాం. సంబంధిత కంపెనీ చేపట్టిన స్కీమ్ ఎందుకు ఫెయిల్ అయింది? అందుకు దారితీసిన కారణాలేమిటి? ఎక్కడ లోపాలు దొర్లాయి? ఎలా చేసి ఉంటే విజయవంతమయ్యేది? ఇలా సమస్యను విశ్లేషించి పరిష్కారం సూచిస్తాం. కలెక్టర్‌కు నివేదిక ఇవ్వాలి ఐఐఎం- ఇండోర్‌లో మరో అద్భుత కార్యక్రమం.. రూరల్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్. ఇందులో భాగంగా ఒక్కో విద్యార్థుల గ్రూప్‌కు ఒక్కో జిల్లా కేటాయిస్తారు. విద్యార్థుల బృందం.. ఆ జిల్లాలో పర్యటించి.. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సరిగా అందుతున్నాయా? లేదా? ఏమైనా సమస్యలు ఉన్నాయా? పరిష్కార మార్గాలు.. ఇలా అధ్యయనం చేసి ఒక నివేదికను సంబంధిత జిల్లా కలెక్టరుకు ఇవ్వాలి. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్.. మన తెలుగు విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ కోర్సును అత్యుత్తమ కెరీర్ ఆప్షన్‌గా భావించాలి. కోర్సులో చేరితే మంచి భవిష్యత్ సొంతం చేసుకోవచ్చు. చిన్నవయసులోనే మంచి ఎక్స్పోజర్ ఈ కోర్సు ద్వారా లభిస్తుంది. ప్రభుత్వాలు చేపట్టే వివిధ పథకాల అమలు, ప్రజలకు పథకాల లబ్ధి చేరడం కోసం ప్రభుత్వం మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లను నియమించుకుంటే మంచిదని నా అభిప్రాయం. -
క్యాంపస్ అంబాసిడర్ -వి. భానుప్రకాశ్ -ఐఐటీ - గువహటి
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -గువహటి (అసోం).. పరిచయం అక్కర్లేని విద్యా సంస్థ. ఇంజనీరింగ్ కోర్సులను అందించడంలో ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సెకండియర్) చదువుతున్నారు.. వండాన భానుప్రకాశ్. సీఎస్ఈ డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్‌గా కూడా వ్యవహరిస్తున్న ఆయన తన ఇన్స్టిట్యూట్ ప్రత్యేకతలను, ఫ్యాకల్టీ విశేషాలను వివరిస్తున్నారిలా.. సీనియర్ల సహకారం ఎంతో ఐఐటీ గువహటి క్యాంపస్ 700 ఎకరాల్లో ఉంటుంది. చుట్టూ కొండలు, పచ్చటి గడ్డి మైదానాలతో అలరారుతుంది. క్యాంపస్‌లో ర్యాగింగ్ లేదు. మొదట్లో అంతా గజిబిజిగా ఉండేది. సబ్జెక్టులు, పరీక్షలు, ఇతర అన్ని విషయాల్లో సీనియర్లు సహాయం చేసేవారు. కారం ఎక్కువ తినే మన తెలుగు విద్యార్థులకు ఆహారం అంత రుచిగా అనిపించదు. ఇక.. క్యాంపస్ అంతా వై-ఫై ఉంది. లైబ్రరీ, ఆడిటోరియం, లేబొరేటరీలు, ప్లే గ్రౌండ్స చాలా బాగుంటాయి. ప్రతిభావంతులకు స్కాలర్షిప్స్ ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు క్లాసులుంటాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. శని, ఆదివారాలు సెలవు. ప్రతి విద్యార్థికీ యూజర్ నే మ్, పాస్వర్డ్ ఇస్తారు. దీని ద్వారా వెబ్‌లో లాగినై ఆన్లైన్ మెటీరియల్ పొందొచ్చు. విద్యార్థులు కోర్సుపై ఫీడ్ బ్యాక్ ఇవ్వొచ్చు. విద్యార్థులకు కోర్సు నచ్చకపోతే దానిని తీసేస్తారు. ఫ్యాకల్టీ చాలా బాగా బోధిస్తారు. ఏవైనా సందేహాలు వస్తే వెంటనే నివృత్తి చేస్తారు. ఒక్కో సెమిస్టర్లో 5 కోర్సులు, 2 ల్యాబ్ కోర్సులు ఉంటాయి. నేను పరీక్షలో ఇప్పటివరకు పదికి 8.00 సీజీపీఏ సాధించాను. సెమిస్టర్‌కు అన్నీ కలుపుకుని రూ.50,000 వరకు ఖర్చు అవుతుంది. అయితే తల్లిదండ్రుల వార్షికాదాయాన్ని బట్టి, ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్స్ అందుబాటులో ఉన్నాయి. క్యాంపస్‌లో తెలుగు విద్యార్థులే ఎక్కువ తెలుగు ఫ్యాకల్టీ 15 మంది ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. వారు విద్యార్థులతో ఎంతో సన్నిహితంగా ఉంటారు. ముఖ్యంగా ఉగాది. శ్రీరామనవమి, దీపావళి, వినాయకచవితి వంటి పండుగలను బాగా చేస్తాం. ప్రతి ఏటా టెక్నికల్ ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్‌లను కూడా విద్యార్థులే కమిటీలుగా ఏర్పడి నిర్వహిస్తారు. టెక్నికల్ ఫెస్ట్‌లో భాగంగా వివిధ పోటీలు, గెస్ట్ లెక్చర్స్ వంటివి ఉంటాయి. దేశ,విదేశాల్లోని ప్రఖ్యాత విద్యా సంస్థల నుంచి ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు క్యాంపస్‌కు విచ్చేస్తారు. కల్చరల్ ఫెస్ట్‌లో భాగంగా సంగీత, నృత్య కార్యక్రమాలు ఉంటాయి. మూడో ఏడాది వేసవి సెలవుల్లో ఇంటర్న్‌షిప్ ఉంటుంది. రెండు నెలలపాటు ఇంటర్న్‌షిప్ చేయాలి. ఇందుకోసం ఎన్నో కంపెనీలు క్యాంపస్‌కు వస్తాయి. రెండు నెలల ఇంటర్న్‌షిప్‌లో రూ.లక్ష వరకు స్టైఫండ్ కూడా ఇస్తారు. రూ.50 కోట్లకు యాహూ కొనుక్కుంది ఇక్కడ కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులు మంచి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ పొందుతున్నారు. వార్షిక వేతనాలు కనీసం రూ.6 లక్షలు, గరిష్టంగా రూ.1.2 కోట్లు అందుతున్నాయి. ఇటీవల మా సీనియర్ విద్యార్థులు ఏర్పాటు చేసిన బుక్‌పాడ్ అనే స్టార్టప్‌ను.. యాహూ రూ.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ ముగ్గురూ కూడా మన తెలుగువారే కావడం గర్వించదగిన విషయం. నేను కూడా కోర్సు పూర్తయ్యాక మూడు, నాలుగేళ్లు ఉద్యోగం చేస్తాను. తర్వాత సొంత కంపెనీని ఏర్పాటు చేస్తా.