రవాణా శాఖపై ‘ఓవర్ లోడింగ్’
సాక్షి, విశాఖపట్నం : సిబ్బంది సమస్యతో సతమతమవుతున్న రవాణా శాఖపై అదనపు భారం పడింది. ఇకపై ‘ఓవర్ లోడింగ్’ కేసుల నమోదు శాఖాపరంగానే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఎంవీఐ చట్టం మేరకు పోలీసు, రవాణా శాఖ సంయుక్తంగా కేసులు నమోదు చేసేవారు. పోలీసుల ప్రమేయంతో ఆదాయం వస్తున్నా కొంతమొత్తం పక్కదారి పడుతోందన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఈ తాజా నిర్ణయం తీసుకుందని సిబ్బంది చెబుతున్నారు.
జిల్లా రవాణా శాఖకు ఈ ఏడాది ప్రభుత్వం రూ.234 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇందులో 20 శాతం ఓవర్ లోడింగ్ కేసుల ద్వారానే రాబట్టాల్సి ఉంది. అధికారులు ఉదయం వేళల తనిఖీలు, మధ్యాహ్నం వేళ కార్యాలయ పనులూ చూస్తున్నారు. పైగా నిన్నమొన్నటి వరకు ఓవర్ లోడింగ్ కేసులు స్పాట్లోనే రాసేవారు. కేసులు పెరుగుదల దృష్ట్యా వాహనాన్ని స్వాధీనం చేసుకోవాలని, తప్పనిసరిగా కోర్టు ముందుంచాలన్న నిబంధన విధించారు.
అయితే సామర్థ్యానికి మించిన లోడుతో వాహనం వెళ్తుండగా తనిఖీల్లో చిక్కితే నిత్యావసర సరుకులైతే రూ.1000 జరిమానా వేస్తారు. ఇతర వస్తువులైతే రికార్డులు స్వాధీనం, సీఫీజు వసూలు, కోర్టు కేసు, పర్మిట్ రద్దు వంటి అంశాలు చేపడతారు. కొన్నిసార్లు సామగ్రిని ఇతర వాహనాల్లోకి అన్లోడ్ చేయించి వాహనాన్ని రోడ్డుమీదకు అనుమతిస్తారు. అప్పుడప్పుడు చెక్రిపోర్టు రాసి మరుసటి రోజు ఫైన్ కట్టించుకుంటారు.
భారీ స్థాయిలో సిబ్బంది ఉంటేనే ఈ తతంగం సాధ్యమవుతుంది. పైగా జిల్లాకు సరిపడే సీజ్ చేసిన వాహనాలుంచే స్థలం (వాహన డిటెన్షన్) కూడా లేదు. పోలీస్ స్టేషన్లు, ఆర్టీసీ డిపోలు, ఫైర్ కార్యాలయాల్లో వాహనాలు ఉంచుతున్నారు. కోర్టుకెళ్లి, జరిమానా కట్టి రికార్డులు తెచ్చుకునే సరికి వారం పైనే పడుతుండడంతో తమ వాహనాలు, సరుకు భద్రతపై యజమానులు, పలు సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవీ ఇబ్బందులు
పోలీసులను కాదని ఓవర్ లోడింగ్ కేసులు రవాణా శాఖ అధికారులే నమోదు చేయాలని ప్రభుత్వం చెబుతున్నా అది సాధ్యం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే శాఖాపరంగా సిబ్బంది కొరత పీడిస్తోంది. మరోవైపు కొత్త రిక్రూటీల పరిస్థితి సందిగ్ధంలో పడింది. కొత్తవారొస్తే వారితో ఎన్ఫోర్స్మెంట్ బృందాన్ని రూపొందించాలన్న ఉద్దేశంలో అధికారులున్నా ఎప్పటికి సాధ్యమన్నదే సందేహం.
తాజాగా సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో రవాణా శాఖ ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఒకవేళ ఉద్యమం ఓ కొలిక్కి వచ్చినా పెండింగ్ పనులు పూర్తయ్యేంత వరకు ఓవర్లోడింగ్ కేసుల నమోదు కష్టమే. ఈలోగా ఆర్థిక సంవత్సరం ముగిసిపోతుంది. ఈ పరిస్థితుల్లో కొన్నాళ్లయినా ప్రభుత్వం ఈ ఉత్తర్వులను సవరించాల్సి ఉంటుందన్న అభిప్రాయం శాఖాపరంగా వినిపిస్తోంది.