ఈ సినిమా జనం కోసం..
న్యూఢిల్లీ: ఈరోజుల్లో సినిమా కనిపించని ఓ పెద్ద వ్యాపార సామ్రాజ్యం. దీని కోసం తాపత్రయపడేవారంతా స్వలాభం ఆశించి పనిచేసేవారే. కానీ, కర్ణాటకలో కొన్ని చిత్ర నిర్మాణ సంస్థలు, మరో స్వచ్ఛంద సంస్థ కలిసి గొప్ప సామాజిక సేవకు దిగారు. దాదాపు తొమ్మిదిమంది క్యాన్సర్ రోగులకు ఊరట కలిగించారు. తాము నిర్మించిన 'ది ప్లాన్' ను సినిమా థియేటర్లలో ప్రదర్శించడం ద్వారా వచ్చిన డబ్బులను వారి జబ్బులను నయం చేసేందుకు ఖర్చు చేశారు.
ఈ కేన్సర్ సోకిన వారంతా కూటికి గుడ్డకు నోచుకోని వారే. శ్రీరక్ష, ప్రజ్నా, అమిషా, నఫిసాధులా ఇఫ్రాంత్, దేవప్రియ, నిధి కామత్, మరియం సహీరా, అపేక్ష, ఫాతిమఠ్ మిస్బా అనే తొమ్మిదిమంది కేన్సర్ పేషెంట్లు ప్రస్తుతం మంగళూరులోని కస్తుర్బా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి పూర్తి స్థాయిలో చికిత్స అందించాలంటే లక్షల్లో ఖర్చవుతుంది.
దీంతో కాన్ కిడ్స్ కిడ్ స్కాన్ అనే ఓ ఎన్జీవో సంస్థ కన్నడ చిత్రం ది ప్లాన్ నిర్మాతలు మాల్గుడి టాకీస్, డే డ్రీమ్ క్రియేషన్స్ తో చేతులు కలిపింది. ఆ సంస్థల ఆధ్వర్యంలో నిర్మించిన ది ప్లాన్ చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శించి వచ్చిన డబ్బంతా వారి వైద్యానికి ఉపయోగించింది.అంతేకాదు వారి విద్యకోసం అయ్యే వ్యయం కూడా తామే చూసుకుంటామని చెబుతోంది.