అన్నీ నాణేలే ఇచ్చారు.. అవి తీసుకునే దిక్కెవరు?
పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళలకు కొత్త కష్టాలనే తీసుకొచ్చి పెట్టింది. అసలకే భర్తను కోల్పోయి, ఉన్న ఒక్కానొక్క కొడుకు క్యాన్సర్‌తో భాదపడుతూ ఉంటే... నోట్ల మార్పిడి అంశం సర్జు దేవీకి మరింత కృంగదీసింది. రూ.2000 పాత కరెన్సీని మార్చుకోవడానికి లక్నో నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోహన్‌లాల్ గంజ్ ప్రాంతంలోని బ్యాంకుకు వెళ్లిన ఆమెకు, బ్యాంకు వారు మొత్తం ఒక్క రూపాయి నాణేలతో కూడిన బ్యాగును అందించారు. 17కేజీల బరువున్న నాణేల బ్యాగును చూసుకుని ఆవేదన చెందిన ఆమె, ఇంటివరకు మోసే శక్తి లేకపోవడంతో,వాటికి బదులుగా వేరేవి ఇవ్వాలని అభ్యర్థించింది. ఆమె అభ్యర్థనను పట్టించుకోని బ్యాంకులోని ఓ మహిళా సిబ్బంది రూడ్‌గా సమాధానమిచ్చింది. ఇచ్చిన డబ్బును తీసుకెళ్లాలంటూ మూర్ఖంగా సమాధానం చెప్పినట్టు సర్జు పేర్కొంది.
అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడి రాం కుమార్ యాదవ్ రిపోర్టులు చూపినప్పటికీ ఎలాంటి దయాగుణం చూపించలేదని తెలిపింది. తన కుమారుడికి క్యాన్సర్ ఉన్నట్టు గతేడాది నిర్థారణ అయిందని, అప్పడు వైద్యచికిత్స కోసం రూ.1 లక్ష నగదును వైద్య చికిత్స కోసం ప్రభుత్వం జారీచేసినట్టు సర్జు చెప్పింది. పెద్ద నోట్లను రద్దుచేస్తూ నవంబర్ 8న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో, వైద్యం చేపిండానికీ, కనీసం చెక్‌అప్‌లకు ఎలాంటి నగదు దొరకడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది.
ప్రస్తుతం తన కొడుకుకు రేడియో థెరపీ జరుగుతుందని, మూడు రోజుల నుంచి ఏ ఆసుపత్రివారు ఆ రూపాయి నాణేలను అంగీకరించడం లేదని, వారికి ఆ నాణేలను లెక్కించే ఓపిక లేదని తెలిపింది. కేవలం సర్జు మాత్రమే కాక, మోహన్‌లాల్‌గంజ్‌లో చాలామంది ఇలాంటి బాధలే పడుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా వివాహా వేడుకలు నిర్వర్తించేవారు పడరాని పాట్లు పడుతున్నారు. ఎవరూ చెక్స్‌ను అంగీకరించడం లేదని, నగదురహిత లావాదేవీలను ప్రజలు నమ్మడం లేదని ఓ వ్యక్తిచెప్పాడు.