హవా
ఏకగ్రీవమైన ఎంపీటీసీ స్థానాల్లో 9 వైఎస్సార్ సీపీ కైవసం
టీడీపీ 5, కాంగ్రెస్ నిల్ మరో ఐదుచోట్ల స్వతంత్రుల పైచేయి
సాక్షి, ఒంగోలు : సార్వత్రిక ఎన్నికలకు ముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధిస్తోంది. మున్సిపాలిటీల్లో ఏకగ్రీవ వార్డులను కైవసం చేసుకున్న పార్టీ అభ్యర్థులు.. ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఆధిక్యత కనబరుస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసేనాటికి మొత్తం 9 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవమవడం విశేషం. టీడీపీ ఐదింటికి పరిమితం కాగా, కాంగ్రెస్ ఖాతాలో ఏఒక్క స్థానం కూడా చేరలేదు. స్వతంత్రులు మాత్రం ఐదుచోట్ల ఏకగ్రీవమయ్యారు. మొత్తం 790 ఎంపీటీసీ స్థానాల్లో 19 చోట్ల అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.
అదేవిధంగా నామినేషన్ల ఉపసంహరణ, తిరస్కరణ అనంతరం 56 జెడ్పీటీసీ స్థానాల్లో 211 మంది బరిలో ఉన్నారు. గ్రామాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వాతావరణం వేడెక్కగా, అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. క్షేత్రస్థాయిలో నేతలు ప్రజలను కలుసుకుంటున్నప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్కు విశేష ప్రజాదరణ లభిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమైన నేపథ్యంలో ఆపార్టీ నేతలు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. చొరవగా ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారు. మరోవైపు టీడీపీ నేతలు గ్రామాల్లో పర్యటించేటప్పుడు వారికి ఎదురవుతోన్న వ్యతిరేక అనుభవాలను జీర్ణించుకోలేకపోతున్నారు.
రాష్ట్రవిభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వడమే కాకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరిస్తోన్న రెండు కళ్ల సిద్ధాంతం గ్రామస్థాయిలో బెడిసికొట్టి.. జనాలముందు తలెత్తుకోలేని విధంగా ప్రభావం చూపుతోందని ఆపార్టీ నేతలు మదనపడుతున్నారు. ఈక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ హవా ఊరూరా కనిపిస్తోంది. ఇటీవల ఆపార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ప్రచార పర్యటన కూడా పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం తెప్పించింది. ప్రధానంగా బడుగు, బలహీనవర్గాల కాలనీల్లో ప్రజలు వైఎస్సార్ సీపీ బ్యానర్లు, ఫ్లెక్సీలు, జెండాలు పెట్టుకుంటూ.. ఎవరికి వారు స్వచ్ఛందంగా పార్టీ తరఫున ప్రచారం చేయడం విశేషం. జిల్లావ్యాప్తంగా ‘ఫ్యాన్’ గాలి ఉధృతంగా వీస్తోన్న నేపథ్యంలో మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో అత్యధికం వైఎస్సార్ కాంగ్రెస్ కైవసం చేసుకోవడం తథ్యమని రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.