కట్టుకున్నవాడే నులిమేశాడు..
- రెండో భార్య మోజులో పడి...
- మొదటి భార్యను హత్య చేసిన వైనం
- చంద్లాపూర్‌లో ఉద్రిక్తత..
- గ్రామస్తుల ఆందోళన
- పోలీసులకు లొంగిపోయిన నిందితుడు
చిన్నకోడూరు: కడదాకా తోడుంటానని నమ్మబలికి పెళ్లాడిన వ్యక్తి రెండోభార్య మోజులో పడి మొదటి భార్యను గొంతు నులిమి హత్యచేశాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. ఈ సంఘటన మండల పరిధిలోని చంద్లాపూర్‌లో ఆదివారం కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కందుకూరి శ్రీనివాసచారి ఎనిమిదేళ్ల క్రితం వినోద(28)ను వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు సాయిచరణ్ (06)ఉన్నాడు. కుల వృత్తిని నమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంత కాలంగా భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం శ్రీనివాసచారి మరో మహిళను వివాహమాడాడు. వీరికి మూడు నెలల పాప. సిద్దిపేట పట్టణంలో ఈ కుటుంబాన్ని ఉంచాడు. ఈ విషయం మొదటి భార్యకు తెలవడంతో నిత్యం ఇంట్లో గొడవలవుతున్నాయి.
దీంతో విసుగు చెందిన చారి ఆదివారం ఉదయం ఇంట్లో మద్యం తాగి భార్య వినోదను బెల్టుతో గొంతునులిమి హత్య చేశాడు. కుమారుడ్ని తీసుకొని బయటకు వెళ్లిపోయాడు. ఇది గమనించిన చుట్టు పక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందిం చారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట రూరల్ సీఐ ప్రసన్నకుమార్, ఎస్ఐ సత్యనారాయణలు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధం కావడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన గ్రామానికి చేరుకుని వారిని శాంతింపజేశారు. శ్రీనివాస్‌చారి తమ అదుపులోనే ఉన్నట్లు ఎస్ఐ సత్యనారాయణ వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.