ప్రత్యక్ష నరకం..
- ‘కృష్ణా’ పనులతో స్తంభిస్తున్న ట్రాఫిక్
- వాహనదారులకు ఇక్కట్లు..
- మంగళవారం మూడు ప్రమాదాలు
చాంద్రాయణగుట్ట: చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ప్రాంతంలో కొనసాగుతున్న కృష్ణా మూడోదశ మంచినీటి పైప్‌లైన్ పనులతో వాహనదారులు తీవ్ర నరకం అనుభవిస్తున్నారు. సరిగ్గా ఫ్లైఓవర్ కింది భాగంలో ప్రస్తుతం పనులు కొనసాగుతుండటంతో చార్మినార్ వైపు నుంచి వచ్చే వాహనాలను చాంద్రాయణగుట్ట చౌరస్తా మీదుగా దారి మళ్లిస్తున్నారు. చాంద్రాయణగుట్ట చౌరస్తా (బంగారు మైసమ్మ ఆలయ ప్రాంతం) నుంచి చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ రోడ్డు మీదుగా పహాడీషరీఫ్ వైపు వెళ్తున్నాయి.
దీంతో ఈ రూట్లో ట్రాఫిక్ పెద్ద ఎత్తున స్తంభించిపోయి వాహనదారులకు ప్రత్యక్ష నరకాన్ని చూపుతోంది. స్తంభించిన ట్రాఫిక్‌లో కొందరు వాహనదారుల తొందరపాటుతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం మూడు ప్రమాదాలు జరిగాయి. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొనడంతో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. అదే విధంగా చాంద్రాయణగుట్ట చౌరస్తా ప్రాంతంలో కాంక్రీట్ లారీ కారును ఢీకొట్టింది. ఉమర్ హోటల్ ప్రాంతంలో ర్యాష్‌గా వచ్చిన వాహనదారుడిని తప్పించే క్రమంలో లోడ్‌తో వెళ్తున్న లారీ పైప్‌లైన్ గోతిలో కూరుకుపోయింది.
చాంద్రాయణగుట్ట చౌరస్తా నుంచి ఫ్లైఓవర్ వైపు వెళ్లే రూట్ కూడా మూసేసి కేవలం ఫ్లైఓవర్ నుంచి రాకపోకలు సాగించారు. శ్రీశైలం, కల్వకుర్తి నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను కూడా చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ రోడ్డు నుంచి వెళ్లనీయడంతో ఈ రోడ్డంతా రద్దీగా మారింది. ముఖ్యంగా చాంద్రాయణగుట్ట చౌరస్తా వాహనదారులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. మంగళవారం దినమంతా ఇదే పరిస్థితి నెలకొనడంతో వాహనదారులకు ప్రత్యక్ష నరకం కనిపించింది. కేశవగిరి నుంచి వచ్చే చిన్న వాహనాలను మాత్రమే ఫ్లైఓవర్ కింది నుంచి చార్మినార్, మిధాని వైపు రాకపోకలు సాగనిచ్చారు.