గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టు
నెల్లూరు (కావలి): ఒంగోలు వైపు నుంచి నెల్లూరు వైపు వెళుతున్న ఓ కారు ముందు వెళుతున్న ఆటోను ఢీకొన్న ప్రమాదంతో భారీ స్థాయిలో గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టయింది. బుధవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలంలోని గౌరవరం టోల్‌ప్లాజా సమీపంలో జరిగిన ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న పది మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరగడంతో కారుతో పాటు అందులో ఉన్న గంజాయిని కూడా వదిలి నిందితులు పరారయ్యారు.
సమాచారం అందుకున్న కావలి రూరల్ సీఐ మధుబాబు సంఘటన స్థలానికి చేరుకుని కారు, అందులో ఉన్న 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు కారకులుగా భావిస్తూ తమిళనాడు రాష్ట్రానికి చెందిన నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే వారు తాము పడవల ఇంజన్లను మరమ్మతులు చేసేవారిమని పోలీసులకు చెబుతున్నట్లు తెలుస్తోంది.