'రాజధాని గ్రామాల్లో సాగును అడ్డుకునే కుట్ర'
మంగళగిరి(గుంటూరు జిల్లా): రానున్న సీజన్లో వ్యవసాయ పనులకు రైతులను సమాయత్తం చేసేందుకు ప్రభుత్వం రూపొందించిన సాగుకు సమాయత్తం’ కార్యక్రమంలో రాజధాని భూ సమీకరణ గ్రామాలను ఎందుకు విస్మరించారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ప్రశ్నించారు. భూసమీకరణ నుంచి తమను మినహాయించాలంటూ కోర్టుకు వెళ్లిన రైతుల భూముల్లో వ్యవసాయ పనులకు అవరోధాలు సృష్టించవద్దని న్యాయస్థానం చెప్పినా ఖాతరు చేయకుండా అవరోధాలు సృష్టిస్తూ కోర్టు తీర్పును ధిక్కరిస్తున్నారని చెప్పారు.
ఆయన శుక్రవారం మంగళగిరిలో విలేకరులతో మాట్లాడుతూ మండలాల వారీగా సాగుకు సమాయత్తం షెడ్యూల్ కార్యక్రమం వివరాలను విడుదల చేసిన ప్రభుత్వం మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని రాజధాని భూసమీకరణ గ్రామాలను ఉద్దేశపూర్వకంగానే చేర్చలేదని అనుమానం వ్యక్తం చేశారు. తొలుత రైతుల రుణాలు నిలిపివేస్తూ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీచేశారని, అనంతరం ఎరువుల సరఫరా నిలిపివేయడంతో పాటు పొలాల్లోని మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిపేస్తామనిబెదిరించడంతో ఆందోళన చెందిన రైతులు కోర్టును ఆశ్రయించారని తెలిపారు.
కోర్టును ఆశ్రయించిన రైతుల వ్యవసాయ పనులకు విఘాతం కలిగించవద్దని తేల్చిచెప్పినా, రైతులను వ్యవసాయం చేసుకోనివ్వకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే సాగుకు సమాయత్తం కార్యక్రమంలో ఆ గ్రామాలను చేర్చలేదని చెప్పారు. ఈ కుట్రను కోర్టుకు తెలియజేస్తామన్నారు. విజయవాడలో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ ఆధ్వర్యంలో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియలో రైతుల సమస్యలు’ అంశంపై శుక్రవారం జరిగిన చర్చాకార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ భూసేకరణ చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన 166 జీవోపై పిల్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు.