పడిపోయిన పారిశ్రామికోత్పత్తి
♦ నవంబర్‌లో మైనస్ 3.2% క్షీణత
♦ రికవరీ ఆశలపై నీళ్లు
♦ తయారీ, భారీ వస్తు ఉత్పత్తి
విభాగాల పేలవ పనితీరు...
న్యూఢిల్లీ: దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి తీవ్ర నిరాశను మిగుల్చుతోంది. 2015 నవంబర్ నెలలో అసలు ఉత్పత్తిలో వృద్ధి లేకపోగా (2014 నవంబర్‌తో పోల్చిచూస్తే...) -3.2 శాతం క్షీణత నమోదయ్యింది. 2014 నవంబర్‌లో ఉత్పత్తి వృద్ధి 5.2 శాతంగా నమోదయ్యింది. ఇంతటి పేలవ పనితీరు గడచిన నాలుగేళ్లలో ఇదే తొలిసారి. అప్పట్లో అంటే అక్టోబర్ 2011లో ఐఐపీ క్షీణతలో -4.7 శాతంగా నమోదయ్యింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 75 శాతం వాటా కలిగిన తయారీ రంగం, అలాగే డిమాండ్‌కు ప్రతిబింబమైన భారీ వస్తు ఉత్పత్తులకు సంబంధించిన క్యాపిటల్ గూడ్స్ రంగం పేలవ పనితనం తాజా సమీక్ష నెల మొత్తం ఫలితాన్ని ప్రధానంగా ప్రభావితం చేసింది.
కాగా ఆర్థిక సంవత్సరం నవంబర్ వరకూ గడచిన ఎనిమిది నెలల కాలంలో ఉత్పత్తి వృద్ధి రేటు 2.5 శాతం నుంచి 3.9 శాతానికి పెరిగింది. కేంద్ర గణాంకాల కార్యాలయం మంగళవారం నాడు విడుదల చేసిన వివరాల ప్రకారం ముఖ్య రంగాలను చూస్తే...
తయారీ: అసలు వృద్ధిలేకపోగా -4.4% క్షీణత నమోదయ్యింది. అయితే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో మాత్రం రేటు 1.5% నుంచి 3.9%కి పెరిగింది. మొత్తం 22 పారిశ్రామిక గ్రూపుల్లో 17 గ్రూపులు క్షీణించాయి.
మైనింగ్: ఉత్పత్తి 4 శాతం నుంచి 2.3 శాతానికి పడింది. ఎనిమిది నెలల కాలంలో కూడా వృద్ధి రేటు 2.5 శాతం నుంచి 2.1 శాతానికి తగ్గింది.
విద్యుత్: నవంబర్‌లో వృద్ధి రేటు 10 శాతం నుంచి 0.7 శాతానికి పడగా, ఎనిమిది నెలల కాలంలో రేటు 10.7 శాతం నుంచి 4.6 శాతానికి తగ్గింది.
క్యాపిటల్ గూడ్స్: 2014 ఇదే నెలలో 7 శాతం వృద్ధి చెందగా, తాజా నెలలో 24.4% క్షీణించింది.
వినియోగ వస్తువులు: ఈ రంగం మాత్రం -1.6 శాతం నుంచి తేరుకుని 1.3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. అయితే కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తులు 12.5 శాతం పెరిగితే, నాన్-డ్యూరబుల్స్ ఉత్పత్తి - 4.7 శాతం క్షీణించింది.
పరిశ్రమ ఆందోళన
తాజా ఫలితం పట్ల పారిశ్రామిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ విభాగాలను చూస్తే... పారిశ్రామిక ఉత్పత్తి రికవరీ రానున్న రోజుల్లో సవాలేనన్న విషయం స్పష్టమవుతోందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ అన్నారు. పన్ను వ్యవస్థలో సరళీకరణలు, ప్రోత్సాహకాలు, వడ్డీరేట్ల తగ్గింపు ద్వారానే వృద్ధి అవకాశాలు మెరుగుపడతాయని పీహెచ్డీ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ మహేశ్ గుప్తా పేర్కొన్నారు.