నేనున్నాననీ...
- నేడు విజయవాడలోని లెనిన్ సెంటర్ వద్ద వైఎస్ జగన్మోహన్రెడ్డి ధర్నా
- భూ సేకరణ, గ్రామకంఠాల గుర్తింపు విధానాలకు వ్యతిరేకంగా నిరసన
- రాజధాని గ్రామాలకు అండగా నిలుస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
- ఆది నుంచి జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలకు ఎదురొడ్డి పోరాటం
సాక్షి ప్రతినిధి, గుంటూరు : రాజధాని గ్రామాల్లో అన్యాయానికి గురైన అన్ని వర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అండగా నిలుస్తోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన నేతృత్వంలోని రైతులు, కౌలు రైతులు, కూలీల పరిరక్షణ కమిటీ రాజధాని గ్రామాల్లో పర్యటించి భరోసా కలిగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ‘కంచే చేను మేసిన చందంగా’ వ్యవహరిస్తుంటే తమ పరిస్థితి ఏమిటని రాజధాని గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్న తరుణంలో ‘నేనున్నానంటూ..’ వైఎస్సార్సీపీ రంగంలోకి దిగింది.
రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని నిక్కచ్చిగా చెబుతూనే...దీని పేరిట ఏ ఒక్క రైతుకు కానీ, కౌలు రైతుకు కానీ, కూలీకి కానీ అన్యాయం జరిగితే సహించేది లేదని స్పష్టం చేస్తోంది. ప్రతిపక్షంగా తన బాధ్యతను నిర్వర్తిస్తోంది. రాజధాని గ్రామాల్లో జరుగుతున్న అక్రమాలు, ముఖ్యంగా రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిపక్ష నాయకుని హోదాలో జగన్ అసెంబ్లీ సమావేశాలు జరిగిన ప్రతిసారి సభ దృష్టికి తెస్తూనే ఉన్నారు. భూ సమీకరణతో తృప్తి చెందకుండా, భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేయడంతో జగన్మోహన్రెడ్డి మరోసారి రైతు పక్షాన పోరాటానికి సిద్ధమయ్యారు.
విజయవాడ సీఆర్డీఏ కార్యాలయానికి సమీపంలోని లెనిన్ సెంటరు వద్ద బుధవారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సాలీనా మూడు పంటలు పండుతున్న నదీపరివాహక ప్రాంతంలోని భూముల సేకరణ, గ్రామ కంఠం సరిహద్దుల గుర్తింపులో ప్రభుత్వం అనుస రించిన విధానానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని ఆయన చేపడుతున్నారు. భూ సమీకరణ, సేకరణలను వ్యతిరేకిస్తూ కొందరు చేస్తున్న న్యాయపోరాటానికి మద్దతుగా నిలిచే బాధ్యతను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే)కి అప్పగించారు.
రాజధాని నిర్మాణానికి భూమిని సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సమయంలో తాడికొండ నియోజకవర్గం తుళ్ళూరు మండల రైతులు మొదట సానుకూలంగా వ్యవహరించారు. మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని వ్యవసాయ భూముల ధరలకు, ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి వ్యత్యాసం ఎక్కువగా ఉండటంతో అక్కడి రైతులు దీనిని పూర్తిగా వ్యతిరేకించారు. ముఖ్యంగా నదీపరివాహక ప్రాంతంలో సాలీనా మూడు పంటలు పండుతున్న భూములు కలిగిన రైతులు మొదట్లో తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ సమయంలో రైతులకు అవగాహన కలిగించేందుకు, అక్కడ జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు రైతులు, కౌలు రైతులు, కూలీల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు.
సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు కన్వీనరుగా ఏర్పాటు చేసిన ఈ కమిటీ (వివిధ జిల్లాలకు చెందిన పార్టీ శాసన సభ్యులు, సీనియర్లు) రాజధాని గ్రామాల్లో మూడుసార్లు పర్యటించి రైతులకు అవగాహన కలిగించింది. ప్రజల పౌరహక్కులకు భంగం కలిగించే రీతిలో అధికారులు వ్యవహరించినప్పుడు, రైతులు, పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించినప్పుడు పార్టీ నేతలంతా ఉద్యమించి వారికి అండగా నిలిచారు. బుధవారం జరగనున్న ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా నుంచి పార్టీ కార్యకర్తలు, నాయకులు, రాజధాని గ్రామంలోని రైతు లు, రైతు కూలీలు, కౌలురైతులు స్వచ్ఛందంగా పాల్గొననున్నారు.