క్యాపిటేషన్ ఫీజు చట్టవిరుద్ధం: సుప్రీం
న్యూఢిల్లీ: విద్యార్థుల నుంచి ప్రైవేటు ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయడం చట్టవిరుద్ధమని, అనైతికమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇటువంటి చర్యలకు అడ్డుకట్ట వేసేలా, ఆర్థికంగా వెనుకబడిన పేదలకు కాలేజీల్లో ప్రవేశాలకు నిరాకరించకుండా కఠిన చట్టాలు తీసుకురావాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్రప్రభుత్వానికి సూచించింది. లేకుంటే సెల్ఫ్ ఫైనాన్స్ విద్యా సంస్థలు కాస్తా.. స్టూడెంట్ ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్లుగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
క్యాపిటేషన్ ఫీజు పేరుతో అనేక సెల్ఫ్ ఫైనాన్స్ విద్యా సంస్థలు ఎంబీబీఎస్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులకు కోట్ల రూపాయలను వసూలు చేస్తున్నాయని, అందువల్ల ఆర్థికంగా వెనుకబడిన పేదలను ఆ సంస్థలు దూరంగా ఉంచుతున్నాయని స్పష్టం చేసింది. క్యాపిటేషన్ ఫీజు వసూలుకు చెందిన ఒక కేసులో విచారణ సందర్భంగా జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, ఏకే సిక్రీలతో కూడిన బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.