‘మేనేజ్మెంట్ కోటా వివరాలివ్వండి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్ల ప్రవేశాల్లో విద్యార్థుల నుంచి యాజమాన్యాలు క్యాపిటేషన్ ఫీజు వసూలు చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) స్పందించింది. మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ కోటా సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జాబితా, ఆ కోటాల్లో సీట్లు పొందిన విద్యార్థులు జాబితా, వారి ఎంసెట్ ర్యాంకులతో సహా కాలేజీ యాజమాన్యాలు తమకు అందజేయాలని టీఏఎఫ్ఆర్సీ స్పష్టం చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ కిందకి వచ్చే విద్యార్థులు ఎవరూ కాలేజీల్లో ప్రత్యేక ఫీజు చెల్లించవద్దని తెలిపింది. ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించని వారు మాత్రమే రూ. 5,500 స్పెషల్ ఫీజును చెల్లించాలని సూచించింది. ఎన్ఆర్ఐ కోటాలో చేరే విద్యార్థులు చెల్లించే ఫీజుల మొత్తం పోగా మిగతా మొత్తాన్ని మాత్రమే కాలేజీలకు విడుదల చేయాలని ప్రభుత్వానికి సూచించింది.