మంచి బౌలర్లను తీర్చి దిద్దాలి: కెప్టెన్ ధోని
మెల్బోర్న్: భారత బౌలింగ్ గొప్పగా లేకపోవడం సమస్యగా మారిందని కెప్టెన్ ధోని అన్నాడు. ఇకపై టెస్టులు, పరిమిత ఓవర్లకు వేర్వేరుగా బౌలర్లను గుర్తించి తీర్చిదిద్దాల్సిన అవసరం వచ్చిందని అభిప్రాయపడ్డాడు. ‘గత మ్యాచ్‌లో నేను అవుట్ కాగానే జట్టు కుప్పకూలింది. అలా కాకూడదనే ఆరంభంలో భారీ షాట్లకు పోకుండా జాగ్రత్తగా ఆడాను. నాకే ఇబ్బంది అవుతున్న చోట జూనియర్లకు మరింత సమస్య అయ్యేది.
మరో 10-15 మ్యాచ్‌ల వరకు అవకాశం ఇచ్చే విధంగా మనీశ్ పాండే ఆడాడు. పరిస్థితులకు తగినట్లుగా అతని బ్యాటింగ్ అద్భుతంగా సాగింది. ఈ ఇన్నింగ్స్ అతనికే ఒక పాఠంలాంటిది. తొలి మ్యాచ్‌లోనే చాలా బాగా ఆడిన బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ప్రత్యేకంగా ప్రశంసించాలి. అయితే టి20ల కోసం మన ఫీల్డింగ్ మరింత మెరుగు పడాల్సి ఉంది’ అని అన్నాడు. తన రిటైర్మెంట్ గురించి అడుగుతున్నవారు ‘పిల్’ వేసి చూడాలని ధోని సరదాగా వ్యాఖ్యానించాడు.
1 ఆసీస్ గడ్డపై ఒక జట్టు 300పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఆస్ట్రేలియాను ఓడించడం ఇదే మొదటిసారి.
1 ఐదు అంతకంటే తక్కువ వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక పరుగులు (3159), అత్యధిక సెంచరీలు (11) ఇదే సిరీస్‌లో నమోదు కావడం విశేషం.
12 భారత్ తరఫున వన్డేల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్న 12వ ప్లేయర్ రోహిత్‌శర్మ.
210 వన్డేల్లో భారత్ తరఫున ఆడిన 210వ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా