చోటు కోసం పోటీ పెరిగింది
బెంగళూరు: భారత హాకీ జట్టులో చోటు కోసం సీనియర్, జూనియర్ ఆటగాళ్ల మధ్య ఆరోగ్యకర పోటీ ఉండడం శుభసూచకమేనని కెప్టెన్ పీఆర్ శ్రీజేష్ అన్నాడు. జూనియర్ ఆటగాళ్లకు మెంటార్‌గా తగిన సలహాలివ్వాల్సిన అవసరం సీనియర్ ఆటగాళ్లకు ఉందని అభిప్రాయపడ్డాడు. అలాగే జట్టులో చోటు కోసం వారు కూడా కఠినంగా శ్రమించాల్సి ఉంటుందని చెప్పాడు. ‘ప్రాబబుల్స్‌లో చాలా మంది జూనియర్ ఆటగాళ్లు కూడా ఉంటున్నారు. ఇది శుభపరిణామం. జాతీయ జట్టులో చోటు కోసం సీనియర్లు కూడా వీరితో పోటీపడాల్సి వస్తోంది. అయితే శిక్షణ శిబిరంలో జూనియర్ ఆటగాళ్లు తమ ప్రతిభకు మరింత పదును పెట్టాల్సిన అవసరం ఉంటుంది.
దీనికోసం నిరంతరం శ్రమిస్తుండాలి. జాతీయ జట్టులో తాము చోటు దక్కించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఎప్పటికప్పుడు నిరూపించుకోవాలి. ఇక సీనియర్ ఆటగాళ్లు తమ ఫిట్నెస్ కాపాడుకుంటూ జూనియర్లకు పోటీ ఇవ్వగల స్థాయిలో ఉండాలి. 2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్ కోసం జూనియర్ ఆటగాళ్లే భవిష్యత్‌గా చెప్పవచ్చు. అయితే చోటు అదే వస్తుందిలే అనే భావన లేకుండా శ్రమించి సాధించుకోవాల్సిన అవసరం ఉంది’ అని జాతీయ శిబిరంలో పాల్గొన్న శ్రీజేష్ పేర్కొన్నాడు.