రామచంద్రపురం ఎస్సై కారు చోరీ
పెడన రూరల్(కృష్ణా) : తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎస్సై కారు పెడనలో అపహరణకు గురైంది. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఎస్సై దుర్గా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన విశ్రాంత ఎస్సై అబ్దుల్లా బుధవారం మచిలీపట్నంలో మరణించారు. పెడనలోని జామియా మసీదు ప్రాంగణంలో ఉన్న కబరస్తాన్లో అదేరోజు రాత్రి ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. వీరిలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎస్సై రెహమాన్ కూడా ఉన్నారు. రామచంద్రాపురం నుంచి ఆయన ఒక్కరే కారులో ఇక్కడకు వచ్చారు. వాహనాన్ని మసీదు ముందు భాగంలో నిలిపి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. గంట తరువాత రెహమాన్ బయటకు వచ్చి చూడగా కారు కనిపించలేదు. పరిసరాల్లో వెదికినా ఫలితం లేకపోవడంతో స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు.