Carelessness
-
ప్రాణాలతో చెలగాటం
అనంతపురం న్యూసిటీ : నగరంలో కొన్ని ఆస్పత్రులు వైద్య ప్రమాణాలు పాటించడం లేదు. బ్లడ్బ్యాగ్లను అనధికారికంగా తెప్పించుకుని, రోగులకు ఎక్కించేస్తున్నాయి. ఆ రక్తం సురక్షితమైనదో కాదో.. వాటి ప్రమాణాలు ఏపాటివో తెలియడం లేదు. డబ్బు సంపాదన కోసం రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆస్పత్రుల యాజమాన్యంపై ప్రజలు భగ్గుమంటున్నారు. వర్ష ఆస్పత్రిలో అనధికారిక బ్లడ్బ్యాగులను రోగులకు ఎక్కించినట్లు వైద్యాధికారుల తనిఖీల్లో బట్టబయలైంది. వివరాల్లోకెళితే.. తమకందిన సమాచారం మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్, ఔషధ తనిఖీ అధికారులు (డ్రగ్ ఇన్స్పెక్టర్లు) సంధ్య (అనంతపురం), కేశవరెడ్డి (కదిరి)లు అనంతపురంలోని వర్ష ఆస్పత్రిని తనిఖీ చేశారు. వార్డులు, ల్యాబ్‌లు క్షుణ్ణంగా పరిశీలించారు. చిల్లవారిపల్లికి చెందిన రాములమ్మ అనే రోగికి నిబంధనలకు విరుద్ధంగా రక్తం ఎక్కించినట్లు గుర్తించారు. బుక్కపట్నం మండలం చెన్నరాయుడుపల్లికి చెందిన ఎరుకుల సూరి భార్య అనితకు కూడా ఈ నెల 19న ఆస్పత్రిలోనే అనధికారిక బ్లడ్బ్యాగ్ నుంచి రక్తం ఎక్కించినట్లు తేలింది. ఈ రక్తం ఎక్కడి నుంచి సరఫరా అయ్యిందో చెప్పాలని ఆస్పత్రి నిర్వాహకురాలు డాక్టర్ ప్రతిమ చౌదరిని ప్రశ్నిస్తే తనకేమీ తెలియదని బుకాయించారు. ప్రతిమా చౌదరి భర్త డాక్టర్ హర్షవర్ధన్ (అపెక్స్ రేడియాలజిస్టు) కల్పించుకుని అధికారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేయబోయారు. రక్తం ఎక్కించే పని స్టాఫ్‌నర్స్ చూసుకుంటారని చెప్పారు. రక్తం ఎక్కించాక బ్యాగును ఎక్కడ వేశారని అడిగితే.. చెత్తకుండీలో వేశామని స్టాఫ్‌నర్స్ తెలిపారు. కుండీని పరిశీలించగా.. అందులో కనిపించలేదు. రెండు నెలల క్రితం ఎవరో మేడమ్‌కు ఇవ్వాలని బ్లడ్బ్యాగ్లు ఇచ్చి వెళ్లిపోయారంటూ స్టాఫ్‌నర్స్ పొంతనలేకుండా సమాధానం చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆస్పత్రి సీజ్ నిబంధనలకు విరుద్ధంగా రక్తం ఎక్కించినట్లు విచారణలో తేలితే ఆస్పత్రి సీజ్ చేస్తామని డీఎంహెచ్ఓ, డ్రగ్ ఇన్స్పెక్టర్లు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ పురుషోత్తం, డెమో ఉమాపతి, రమణ, వేమారెడ్డి తదితరులున్నారు. -
మళ్లీ బోగస్ వెరిఫికేషన్!
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న రెవెన్యూశాఖ గ్రామాల్లో ఉండాల్సిన వీఆర్ఏలు మండల కార్యాలయంలో గుడివాడ : గుడివాడలో సంచలనం సృష్టించిన బోగస్ రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానంపై రెవెన్యూ అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. పట్టణంలో 43 మంది రేషన్ డీలర్లు నుంచి సుమారు 2,700 తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈమేరుకు ఇంటింటా తిరిగి వీఆర్వోలు పరిశీలన చేసి రిమార్కులు రాశారు. అయితే వీటిని ఆన్లైన్లో పరిశీలించి కార్డు బోగస్దా? కాదా? అనే అంశం తేల్చాల్సి ఉంది. అయితే ఈపనిని రెవెన్యూ అధికారులు వీఆర్ఏలతో చేయిస్తున్నారు. కనీసం వీఆర్వోస్థాయి అధికారి చేయాల్సిన పనిని కార్యాలయం పాస్ వర్డ్‌ను కిందిస్థాయి సిబ్బందికి ఇచ్చి మరీ చేయిస్తున్నారు. రేషన్ కార్డుకు ఆధార్ పోల్చి చూసే పనిని... పట్టణంలోని అన్ని వార్డుల్లో అనుమానం ఉన్న తెల్ల రేషన్ కార్డులను క్షేత్రస్థాయిలో వీఆర్వోలు పరిశీలించారు. గుడివాడ పట్టణంలో దాదాపు 2,700 బోగస్ కార్డులు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తహశీల్దార్ రవిశంకర్ తేల్చి చెప్పారు. అయితే ఆధార్ నంబర్లు ఆన్లైన్లో కార్డులో ఉన్న పేర్లు ఆధార్ అనుసంధానం చేసిన పేర్లు ఒకటోకాదో? తేల్చేపనిని గ్రామాల్లో ఉండే వీఆర్ఏలకు అప్పగించారు. దీంతో గ్రామాల్లో ఉండాల్సిన వీఆర్ఏలు తహశీల్దార్ కార్యాలయంలో ఉంటున్నారు. నిబంధనలు ప్రకారం ఏ ఒక్క వీఆర్ఏ కూడా పెన్ను పట్టుకుని రాయడానికి వీల్లేదు. వీరంతా పార్టు టైమ్ పనివారు కాబట్టి ఆయా గ్రామంలో ఏదైనా జరిగినపుడు మాత్రమే వారికి పని ఉంటుంది. అదికూడా సంబంధిత వీఆర్వో వెంటమాత్రమే వెళ్లాలి. కానీ గుడివాడ రెవెన్యూశాఖ అధికారులు మాత్రం వీఆర్ఏలను బెదిరించి కంప్యూటర్ పనులు చేయించుకుంటున్నారని తెలుస్తుంది. తెల్లరేషన్ కార్డుల విచారణలో వీఆర్ఏలు ఆ కార్డు ఉందని నివేదిక ఇస్తే వారి నివేదిక ప్రకారం కార్డు ఉంచుతారని తెలుస్తోంది. గుడివాడలో సంచలనం సృష్టించిన బోగస్‌కార్డుల వెరిఫికేషన్ వ్యవహారం రెవెన్యూశాఖలో పార్టు టైమర్లుగా ఉన్న వీఆర్ఏలకు అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.