అనంతపురం న్యూసిటీ : నగరంలో కొన్ని ఆస్పత్రులు వైద్య ప్రమాణాలు పాటించడం లేదు. బ్లడ్‌బ్యాగ్‌లను అనధికారికంగా తెప్పించుకుని, రోగులకు ఎక్కించేస్తున్నాయి. ఆ రక్తం సురక్షితమైనదో కాదో.. వాటి ప్రమాణాలు ఏపాటివో తెలియడం లేదు. డబ్బు సంపాదన కోసం రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆస్పత్రుల యాజమాన్యంపై ప్రజలు భగ్గుమంటున్నారు. వర్ష ఆస్పత్రిలో అనధికారిక బ్లడ్‌బ్యాగులను రోగులకు ఎక్కించినట్లు వైద్యాధికారుల తనిఖీల్లో బట్టబయలైంది. వివరాల్లోకెళితే.. తమకందిన సమాచారం మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్, ఔషధ తనిఖీ అధికారులు (డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు) సంధ్య (అనంతపురం), కేశవరెడ్డి (కదిరి)లు అనంతపురంలోని వర్ష ఆస్పత్రిని తనిఖీ చేశారు. వార్డులు, ల్యాబ్‌లు క్షుణ్ణంగా పరిశీలించారు. చిల్లవారిపల్లికి చెందిన రాములమ్మ అనే రోగికి నిబంధనలకు విరుద్ధంగా రక్తం ఎక్కించినట్లు గుర్తించారు.
బుక్కపట్నం మండలం చెన్నరాయుడుపల్లికి చెందిన ఎరుకుల సూరి భార్య అనితకు కూడా ఈ నెల 19న ఆస్పత్రిలోనే అనధికారిక బ్లడ్‌బ్యాగ్ నుంచి రక్తం ఎక్కించినట్లు తేలింది. ఈ రక్తం ఎక్కడి నుంచి సరఫరా అయ్యిందో చెప్పాలని ఆస్పత్రి నిర్వాహకురాలు డాక్టర్ ప్రతిమ చౌదరిని ప్రశ్నిస్తే తనకేమీ తెలియదని బుకాయించారు. ప్రతిమా చౌదరి భర్త డాక్టర్ హర్షవర్ధన్ (అపెక్స్ రేడియాలజిస్టు) కల్పించుకుని అధికారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేయబోయారు. రక్తం ఎక్కించే పని స్టాఫ్‌నర్స్ చూసుకుంటారని చెప్పారు. రక్తం ఎక్కించాక బ్యాగును ఎక్కడ వేశారని అడిగితే.. చెత్తకుండీలో వేశామని స్టాఫ్‌నర్స్ తెలిపారు. కుండీని పరిశీలించగా.. అందులో కనిపించలేదు. రెండు నెలల క్రితం ఎవరో మేడమ్‌కు ఇవ్వాలని బ్లడ్‌బ్యాగ్‌లు ఇచ్చి వెళ్లిపోయారంటూ స్టాఫ్‌నర్స్ పొంతనలేకుండా సమాధానం చెప్పారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే ఆస్పత్రి సీజ్
నిబంధనలకు విరుద్ధంగా రక్తం ఎక్కించినట్లు విచారణలో తేలితే ఆస్పత్రి సీజ్ చేస్తామని డీఎంహెచ్‌ఓ, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ పురుషోత్తం, డెమో ఉమాపతి, రమణ, వేమారెడ్డి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment