జీఎంఆర్‌కు రూ. 5,080 కోట్ల రైల్వే కాంట్రాక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సరుకు రవాణా రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి రూ. 5,080 కోట్ల కాంట్రాక్టును జీఎంఆర్ గ్రూపు దక్కించుకోనుంది. తూర్పు రైల్వేలో నిర్మించనున్న 417 కి.మీ ప్రత్యేక సరుకు రైల్వే ట్రాక్ అంతర్జాతీయ బిడ్డింగ్‌లో అతి తక్కువ ధర కోట్ చేసిన సంస్థగా జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (జీఐఎల్) నిలిచింది. ఈ కాంట్రాక్టుకు ఇంకా తుది ఆమోదం లభించాల్సివుంది. కాంట్రాక్టు లభించిన తర్వాత 45 నెలల్లో ముఘల్సరాయ్ నుంచి కాన్పూర్ వరకు రైల్వేలైన్ నిర్మించాల్సి ఉంటుంది.
రైట్స్ ఇష్యూకి సెబీ అనుమతి
రూ.1,500 కోట్ల రైట్స్ ఇష్యూకి సెబీ అనుమతి లభించింది. ఈ రైట్స్ ఇష్యూ ధరను ఇంకా నిర్ణయించాల్సి ఉంది. ఈ ఇష్యూ ద్వారా సేకరించిన మొత్తాన్ని రుణ భారం తగ్గించుకోవడానికి వినయోగించుకోనున్నట్లు కంపెనీ గతంలో తెలిపిన సంగతి తెలిసిందే.