ముషారఫ్ బండారం బయటపెట్టిన బ్రిటీష్ జర్నలిస్ట్
వాషింగ్టన్/ఇస్లామాబాద్(పిటిఐ): బ్రిటన్‌కు చెందిన ప్రముఖ మహిళా జర్నలిస్ట్ కార్లోట్టా గాల్ తన తాజా పుస్తకంలో పాకిస్తాన్ మాజీ సైనిక నియంత, మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు చెందిన అనేక వాస్తవాలను బయటపెట్టారు. హత్యకు గురైన అల్‌ఖైదా నాయకుడు ఒసామాబిన్ లాడెన్ అజ్ఞాతంలో ఎక్క్డడ ఉండేవాడో ముషారఫ్‌కు తెలుసునని గాల్ తన పుస్తకంలో పేర్కొన్నారు. న్యూయార్క్ టైమ్స్ కోసం ఆమె ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్లలో చాలా సంవత్సరాలు జర్నలిస్ట్‌గా పని చేశారు. తను కొత్తగా విడుదల చేసిన 'రాంగ్ ఎనిమీ' అనే పుస్తకంలో ముషారఫ్‌కు చెందిన అనేక విషయాలను వెల్లడించారు. 300 పేజీలు ఉన్న ఈ పుస్తకం ఏప్రిల్ 8 నుంచి మార్కెట్లో అమ్మకానికి పెడతారు.
కాశ్మీర్ తీవ్రవాదులకు మద్దతు ఇస్తున్నానని చెప్పే ముషారఫ్, ఆల్‌ఖైదాకు మద్దతు ఇవ్వడంలేదని వాదించేవారని ఆ పుస్తకంలో వివరించారు.కోర్టుగనక అనుమతించి ఉంటే ముషారఫ్ పాలనా కాలంలోని అనేక రహస్యాలు వెలుగు చూసి ఉండేవని గాల్ పేర్కొన్నారు. లాడెన్ పాకిస్తాన్‌లోని అబ్బోట్టాబాద్ పట్టణంలో ఒక రహస్య స్థావరంలో ఉండగా 2011 మే నెలలో అమెరికా కమాండోలు దాడి చేసి అతనిని హత్య చేశారు.
ఇదిలా ఉండగా, పలు ఇతర కేసులతోపాటు ముషారఫ్ పాకిస్తాన్ కోర్టులో దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇస్లామాబాద్‌లోని స్పెషల్ కోర్టులో ముషారఫ్‌పై దేశద్రోహ ఆరోపణలు నమోదయ్యాయి.