సుస్వర ద్వయం
స్వరం అందరికీ ఉంటుంది. సుస్వరం కొందరిదే. దానికి రాగం తోడైతే అనురాగం పలికిస్తుంది. మనసును ఓలలాడిస్తుంది. మరెన్నో గాయాలను మాన్పుతుంది. ఆ మధుర స్వరాన్ని సాధనతో మరింత పదును పెడితే.. ఆకాశమే హద్దు అవుతుందంటున్నారు కర్ణాటక సంగీత విద్వాంసులు డి.రాఘవాచారి, శేషాచారి. నగరంలో జరిగిన రాగోత్సవంలో పాల్గొన్న ఈ హైదరాబాద్ బ్రదర్స్‌తో ‘సిటీప్లస్’ ముచ్చటించింది...
సంగీతంలోని సప్తస్వరాల నుంచి వైద్యం చేయవచ్చు. ఇప్పుడు వైద్యులు సైతం రోగాల బాగుకు సంగీతాన్ని ఒక మందుగా ఉపయోగించుకొంటున్నారు. సామ వేదంలో కూడా సంగీతం విలువను ప్రస్ఫుటం చేశారు. త్రికరణ శుద్ధిగా పాడిన పాటను మనసు పెట్టివింటే రోగం శాశ్వతంగా నయం అవుతుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం ఇప్పుడంతా మెడిటేషన్‌ను ఆశ్రయిస్తున్నారు. ఆ మెడిటేషన్ కన్నా బలమైనది సంగీతం. రాధాకళ్యాణం, సత్యభామ కలాపంవంటి నృత్యాల్లో నృత్యకారిణి అభినయం, కదలిక.. ఒక్కోదాంట్లో ఒక్కో ఎనర్జీ ఉంటుంది. అలాగే వాయిద్యంలోనూ అంతే.
ప్రజల్లో భాగం...
రోజులు మారుతున్నాయి. కానీ సంగీతం మారలేదు. స్వరస్థానాలు, మూల మంత్రాలు అవే. కాలమార్పుతో కొన్ని మాత్రమే మారుతున్నాయి. సంగీతంలో అత్యంత విశిష్ఠమైంది కల్యాణ రాగం. అది గతంలో అంతే, ఇప్పుడూ అంతే, ఎప్పటికీ అంతే. సంగీతం ప్రజల జీవన విధానంలో ఒక భాగం. ఫాస్ట్ జనరేషన్లో కొంత వేగవంతమైనా... మళ్లీ పాతరోజులు వస్తాయి.
పాఠ్యాంశంగా...
పద్నాలుగేళ్లలోపు పిల్లలు ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు ఆ సమయంలో సంగీతం నేర్పగలిగితే అది వారి జీవితాన్ని కచ్చితంగా ప్రభావితం చేస్తుంది. ఎన్ని సమస్యలనైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది. ఈ విషయంలోఎ తెలంగాణ విద్యాశాఖ కొంత ముందంజలో ఉంది. పిల్లలకు కర్ణాటక సంగీతం నేర్పాలనే ఆలోచనతో స్కూల్ ఎడ్యుకేషన్, భాషా సాంస్కృతిక శాఖ కలసి పనిచేస్తున్నాయి. ఈ విషయంలో వారికి అప్పుడప్పుడు సలహాలు, సూచనలు అందజేస్తున్నాం.
సికింద్రాబాద్‌లోనూ
రవీంద్రభారతి ఆడిటోరియంలాగా సాంస్కృతిక కార్యక్రమాల కోసం సికింద్రాబాద్‌లోనూ ఓ ఆడిటోరియం నిర్మించాలి. అది కళాభిమానులను ఆకర్షించే విధంగా ఉండాలి. కొత్త ప్రభుత్వం సాంస్కృతిక పరంగా ఎన్నో చేస్తోంది. ఈ అంశంపైనా దృష్టి సారిస్తే బాగుంటుంది.
సంగీతమే సర్వం
మేం పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. మాది సంగీత నేపథ్య కుటుంబం. అందుకే ఐదేళ్లనుంచే శాస్త్రీయ సంగీతాభ్యాసం మొదలుపెట్టాం. ఇందులో అనుభవం 55 సంవత్సరాలు. దేశంలోనే సంగీత జంటల్లో మేమే మొదటి వారం. 1977లో యంగ్ టాలెంట్ అవార్డ్ నుంచి 2012లో కలారత్న బిరుదు వరకు వరించిన అవార్డులు, బిరుదులు ఎన్నో. జరిగిన సన్మానాలు అనేకం. నాటినుంచి నేటివరకూ మమ్మల్ని నిలబెట్టింది ఆ సంగీతమే.