ముళ్ల పొదల్లో ఆడశిశువు మృతదేహం
ముగ్గురిపై కేసు నమోదు
పరకాల : అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన పసికందు ముళ్ల పొదల్లో ప్రత్యక్షమైంది. ఎస్సై దీపక్ కథనం.. మండలంలోని పెద్ద రాజిపేటకు చెందిన గువ్వ రజిత-రాజు దంపతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. మరో సంతానం కోసం ఎదిరి చూస్తున్నారు. రజిత ప్రస్తుతం 22 వారాల గర్భవతి (ఐదు నెలలు). పట్టణంలోని లలితా నర్సింగ్ హోమ్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వైద్యులు గతనెల 30న వైద్యపరీక్షలు చేసి గర్భంలో శిశువు చనిపోయిందని తెలిపారు. ఆదివారం ఆపరేషన్ చేసి శిశువును తొలగించారు.
తొలగించిన శిశువును గుడ్డలో ఉంచి ప్లాస్టిక్ కవర్లో పెట్టి పరకాల-హుజురాబాద్ రోడ్డులోని ఆస్పత్రి ఎదుట ముళ్లపొదల్లో పారేశారు. గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించినట్లు ఎస్సై తెలిపారు. పసికందు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సివిల్ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. శిశువు తొలగించిన ఆస్పత్రిలో విచారణ చేపట్టి గువ్వ రజిత-రాజు, మృతదేహాన్ని పారేసిన పల్లెబోయిన నిర్మలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.
సంఘటనపై పలు అనుమానాలు..
ఆడశిశువు మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రజిత-రాజు దంపతులకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలున్నారు. మూడో సంతానం కూడా ఆడపిల్ల కావడంతోనే ఆబార్షన్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆబార్షన్ చేసినా.. పట్టపగలు నిత్యం ప్రజలు నడిచే దారిలోనే ఎందుకు వేశారనేది అంతుచిక్కడం లేదు. భయంతో దూరం పోలేక ఇలా చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.