case won
-
హైకోర్టులో వృద్ధురాలి విజయం
సారంగాపూర్(జగిత్యాల) : జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం అర్పపల్లికి చెందిన అంబల్ల గంగవ్వకు ఆమె భర్త పేరిట ఉన్న భూములను విరాసత్ చేయాలని రెవెన్యూ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఉత్తర్వులు అందిన ఎనిమిది వారాల్లోగా పట్టాదారు, టైటిల్డీడ్లు అందజేయాలని సూచించింది. అంబల్ల గంగవ్వ భర్త ముత్యంరెడ్డి నవంబర్ 27, 2002లో మృతి చెందాడు. ముత్యంరెడ్డి పేరిట వివిధ సర్వేనంబర్లలో ఉన్న 15.07 ఎకరాలను తన పేరిట మార్పు చేసి పట్టాదారు, టైటిల్‌డీడ్ ఇవ్వాలని మృతుడి భార్య గంగవ్వ అధికారులకు విన్నవించింది. అధికారుల నుంచి స్పం దన కరువైంది. పలుమార్లు తహసీల్దార్ కార్యాల యం చుట్టూ తిరిగినా స్పందన లేకపోవడంతో 2016లో మరోసారి మీసేవ ద్వారా విరాసత్ కు దరఖాస్తు చేసుకుంది. పలు కారణాలు చూపుతూ అధికారులు వాయిదా వేస్తూ వచ్చారు. గంగవ్వ బంధువులు సైతం అడ్డుపడ్డట్లు తెలిసింది. విసిగి వేసారిన గంగవ్వ చివరికి హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో ప్రతివాదులుగా రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, జిల్లా కలెక్టర్, ఆర్డీవో, సారంగాపూర్ తహసీల్దార్లను చేర్చింది. గంగవ్వ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు పట్టాదారు, టైటిల్డీడ్లు ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఉత్తర్వులు అందిన ఎనిమిది వారాల్లోగా గంగవ్వ పేరిట ఆమె భర్త భూములను మార్చా లని ఆదేశించింది. ఈ కేసులో ఎలాంటి రిట్‌పిటిషన్‌కు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని మేజిస్ట్రేట్ ఆదేశాల్లో పేర్కొన్నారు. -
బ్యాంక్‌పై గెలిచిన టీ వ్యాపారి
భోపాల్: చదివింది 5వ తరగతి. వృత్తి టీ అమ్మకం. కష్టపడి బ్యాంక్‌లో దాచుకున్న సొమ్ము మాయమైంది. బ్యాంక్ అధికారులతో అడిగితే చీవాట్లు పెట్టారు. హెడ్ ఆఫీస్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. కంజూమర్ ఫోరమ్‌ను అయితే ఆశ్రయించాడు కానీ, లాయర్‌ను పెట్టుకునే స్థోమత లేదు. ఇలా అన్నీ కష్టాలే. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా తన కేసును తానే వాదించుకున్నాడు. కోర్టులో బ్యాంక్ అధికారులతో నీళ్లు నమలించాడు. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌పై కేసు గెలిచాడు. అసలుతో పాటు వడ్డీ, కోర్టు ఖర్చులు, మానసిక ఒత్తిడి అనుభవించినందుకు అదనపు సొమ్ము రాబట్టాడు. చివరకు సామాన్యుడు కోర్టులో విజేతగా నిలిచాడు. ఎందరికో ఆదర్శంగా నిలిచిన భోపాల్ వాసి రాజేష్ సాక్రే విజయగాథ ఇది. సాక్రే భోపాల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో 20,000 రూపాయల నగదు దాచుకున్నాడు. ఇందులోంచి 10,800 రూపాయలు డ్రా చేశాడు. కొన్ని రోజుల తర్వాత తన ఖాతాలో ఉండాల్సిన మరో 9200 రూపాయలు మాయమయినట్టు గుర్తించాడు. ఈ సంఘటన 2011లో జరిగింది. సాక్రే ఈ విషయంపై బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేస్తే అతణ్నే మందలించారు. ముంబైలోని ఎస్బీఐ హెడ్‌క్వార్టర్స్‌కు ఫిర్యాదు చేసినా సమాధానం రాలేదు. దీంతో జిల్లా కంజూమర్ ఫోరమ్‌ను ఆశ్రయించాడు. ఆర్థిక స్థోమతలేని కారణంగా తన కేసును తానే వాదించుకున్నాడు. సాక్రే డబ్బు డ్రా చేసినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ సహా ఎలాంటి సాక్ష్యాలు చూపలేకపోయారు. పలుసార్లు విచారణ జరిగిన అనంతరం సాక్రే కేసును గెలిచాడు. ఈ నెల 16న కంజూమర్ కోర్టు సాక్రేకు అనుకూలంగా తీర్పునిచ్చింది. సాక్రేకు రావాల్సిన 9200 రూపాయల నగదుతో పాటు దానికి వడ్డీ, కోర్టు ఖర్చుల కింద 2000 రూపాయలు, మానసిక ఒత్తిడి కలిగించినందుకు మరో 10 వేల రూపాయలను చెల్లించాల్సిందిగా కోర్టు బ్యాంక్ అధికారులను ఆదేశించింది. ఈ మొత్తాన్ని రెండు నెలలలోపు అతని ఖాతాలో జమచేయాల్సిందిగా సూచించింది. సామాన్యులకు రాజేష్ సాక్రే విజయగాథ స్ఫూర్తిగా నిలిచింది.