జైలుకు పంపిన రూ. 20
బట్టబయలైన విశాఖ పోర్టు ట్రస్టు ఉద్యోగి మోసం.. కింది కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: మోసగాళ్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో చిన్న తప్పు చేసి దొరికిపోతుంటారు. ఈ కేసులో కూడా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఉద్యోగి ఒకరు రూ.20 విషయంలో చేసిన పొరపాటు అతని మోసాన్ని బట్టబయలు చేసింది. ఆ ఉద్యోగి జైలు ఊచలు లెక్కించాల్సి వచ్చింది. పోర్ట్ ట్రస్ట్ ఆర్థిక సలహాదారు కార్యాలయంలో క్యాష్ సెక్షన్లో 1995-98 మధ్య వెంకటేశ్వరరావు సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేశారు. సిబ్బందికి, పెన్షనర్లకు చెల్లింపులు చేయడం అతని బాధ్యత.
పెన్షన్ చెల్లింపు విషయంలో 137 నకిలీ క్లెయిమ్స్ సృష్టించి రూ.19.80 లక్షలు స్వాహా చేశారు. ఇందులో భాగంగా ఓ క్లెయిమ్ ఫారమ్‌లో రూ.18,558కి బదులు రూ.18,578గా రాశారు. ఆడిట్ సమయంలో రూ.20 ఎక్కువగా చెల్లించినట్లు ఆడిట్ అధికారులు గుర్తించి, దాని గురించి పోర్ట్ ట్రస్ట్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అధికంగా చెల్లించిన మొత్తాన్ని రికవరీ చేయాలని పోర్ట్ ట్రస్ట్ అధికారులను కోరారు. దీంతో వారు పెన్షన్ ఖాతాలను పరిశీలించగా వెంకటేశ్వరరావు చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. మొత్తం 137 నకిలీ క్లెయిమ్స్ సృష్టించి రూ.19.80 లక్షలు స్వాహా చేసినట్లు గుర్తించారు.
దీనిపై విచారణ జరిపిన విశాఖపట్నం సీబీఐ కోర్టు నిందితుడు వెంకటేశ్వరరావుకు జైలు శిక్ష విధిస్తూ మార్చి 31, 2005లో తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ వెంకటేశ్వరరావు అదే ఏడాది హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు కింది కోర్టు వెంకటేశ్వరరావుకు విధించిన జైలుశిక్షను ఖరారు చేస్తూ ఇటీవల తీర్పునిచ్చారు. అయితే అవినీతి నిరోధక చట్టంతోపాటు ఐపీసీలో మరికొన్ని సెక్షన్ల కింద విధించిన అదనపు జైలు శిక్షను మూడు నెలలకు తగ్గించారు. రూ.20 విషయంలో తాను చేసిన పొరపాటు అతన్ని జైలుపాలు చేస్తుందని పిటిషనర్ సైతం ఊహించి ఉండడని న్యాయమూర్తి ఈ సందర్భంగా తన తీర్పులో వ్యాఖ్యానించారు.