మోడు వారిన జీడి
- తీరంలో అంతరించిపోతున్న అటవీ సంపద
- వేరుపురుగు ఆశించి మోడు వారిన చెట్లు
- తోటల్లో మిగిలింది ఇక నూటికి నాలుగే..
- నిద్రావస్థలో అటవీ అభివృద్ధి సంస్థ
పిట్టలవానిపాలెం, న్యూస్‌లైన్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ తీర ప్రాంతంలోని జీడి మామిడి తోటలను గాలికి వదిలేసింది. చెట్లతో పచ్చగా కళకళలాడిన అటవీ భూములు ఇప్పుడు ఎడారిని తలపిస్తున్నాయి. గడచిన ద శాబ్దన్నర కాలంలో దాదాపు 95 శాతం చెట్లు మోడువారాయి. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే తోటలు అంతరించిపోతున్నా పట్టించుకునే నాథుడు లేడు. జిల్లాలోని ప్రధానంగా తీరప్రాంతాలైన బాపట్ల ప్రాంతంలోని ముత్తాయపాలెం, కర్లపాలెం, పేరలి, ప్రకాశం జిల్లాలోని చినగంజాం మండలం కడవకుదురు గ్రామాల్లో వేలాది ఎకరాల్లో రిజర్వు ఫారెస్టు భూములున్నాయి. వీటిల్లో 1956, 57, 58 సంవత్సరాల కాలంలో అటవీశాఖ జీడి మామిడి సాగు చేపట్టింది. అటు పర్యావరణానికి ఇటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి జీడిమామిడి తోటలు ఎంతగానో దోహదం చేస్తున్నాయి. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే జీడిమామిడి తోటల పరిరక్షణకు 1980లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది.
2000 సంవత్సరం తర్వాత తెగుళ్లు ఉధృతం..
నెల్లూరు అటవీ అభివృద్ధి ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటయ్యాక బాపట్ల ఫారెస్టు రేంజ్ విభాగాన్ని కావలి నార్త్ డివిజన్‌గా ఏర్పాటు చేసింది. బాపట్ల ఫారెస్టు రేంజ్ పరిధిలోని జీడి మామిడి తోటలను ఆ సంస్థ పర్యవేక్షణలోకి చేర్చింది. 2000 సంవత్సరం వరకు జీడి మామిడి తోటల పరిస్థితి బాగానే ఉంది. ఆ తర్వాత చెట్లను వేరు పురుగు ఆశించి సమూలంగా నాశనం చేస్తోంది. తోటలను రక్షించే ందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ప్రయోజనం కన్పించడం లేదు. తోటలు అంతరించిపోతున్నప్పటికీ అటవీ అభివృద్ధి సంస్థ మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. దీంతో జీడి మామిడి ద్వారా ప్రభుత్వానికి అందాల్సిన రాబడి పూర్తిగా పడిపోయింది. ఆయా ప్రాంతాల్లో తోటలపై ఆధారపడి జీవించే వారి పరిస్థితి దెబ్బతింది.
15 ఏళ్ల కిందట ఐదు వేల చెట్లు.. ఇప్పుడు 200..
కర్లపాలెం మండలం కొత్తనందాయపాలెంలో 162 ఎకరాల్లో విస్తరించి ఉన్న జీడిమామిడి తోటల్లో 15 ఏళ్ల కిందట ఐదు వేల చెట్లు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 200 చేరుకుంది. తోటలు అంతరించిపోతున్నాయనడానికి ఇది నిదర్శనం. కర్లపాలెం మండలం కొత్తనందాయపాలెంతో పాటు, పేరలిలో 2500 ఎకరాలు, బాపట్ల మండలం ముత్తాయపాలెంలో 5000 ఎకరాలు, ప్రకాశం జిల్లా కడవకుదురులో 20 ఎకరాల విస్తీర్ణంలో జీడిమామిడి తోటలు ఉన్నాయి.
ప్రభుత్వం అంతరించిపోతున్న జీడిమామిడి తోటలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తోటల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి. మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు అవి పెరిగి ఫలసాయం అందించే వరకు అటవీ భూములని రైతులకు నామమాత్రపు లీజుకు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గడంతో పాటు, రైతులకూ ఉపాధి కల్పించినవారవుతారు.