నదులను కాపాడే సీతాకోకచిలుకలు!
రంగు రంగు రెక్కలతో.. హరివిల్లును తలపిస్తూ...పచ్చని చెట్లపై ఎగిరే అందమైన సీతాకోక చిలుకలు.. చూపరులకు కనువిందు చేస్తాయి. మొక్కలపై వాలి.. వాటి పూల పుప్పొడితో ఆ జాతి అభివృద్ధికి దోహద పడతాయి. ఇప్పటికే సీతాకోకచిలుకలు ప్రపంచంలోని అనేక ఇతర జీవుల కన్నా శక్తివంతమైనవిగా గుర్తించబడ్డాయి. ప్రస్తుతం నదులను కాపాడ్డంలోనూ, అడవుల ఆరోగ్యాన్ని రక్షించడంలోనూ ఈ కీటకాలు సహాయపడతాయంటున్నారు పరిశోధకులు.
సుమారు ఆరు దశాబ్దాలుగా సీతాకోక చిలుకల సమగ్ర జాబితాను తయారు చేస్తున్నారు సైంటిస్టులు. ఉత్తరాఖండ్ నైనిటాట్ జిల్లా భిట్మాల్ లోని బట్టర్ ఫ్లై రీసెర్చ్ సెంటర్ కు చెందిన శాస్త్రవేత్త స్మెటాసెక్...ఏళ్ళ తరబడి సీతాకోకచిలుకల సంగ్రహణకు పాటుపడుతూనే వాటి కొత్త జాబితానూ రూపొందిస్తున్నారు. స్మెటాసెక్... తన పరిశోధనల్లో భారతదేశ వ్యాప్తంగా 1,318 రకాల సీతాకోక చిలుకల జాతులు ఉన్నట్లుగా కనుగొన్నారు. సంవత్సరాల కాలం సీతాకోకచిలుకల సంగ్రహణలోనే గడిపిన స్మెటాసెక్... వాటిని పత్రబద్ధం చేయడమే కాక, అవి ఇండియాలోని నదులను కాపాడేందుకు ఎంతగానో సహకరిస్తాయని చెప్తున్నారు.
క్రిమి కీటకాలను ఉపయోగించి అడవుల ఆరోగ్య పరిరక్షణ గురించి తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రతయత్నిస్తున్నారు. అందులో భాగంగానే సీతాకోక చిలుకల జాబితాను సేకరిస్తున్నామని, అవి ఎక్కడ ఏ రకంగా ఉన్నాయో తెలిస్తే.. వాటి జాతుల వర్గీకరణను స్పష్టం చేయవచ్చని, ఆపై అడవుల ఆరోగ్యాన్ని కనిపెట్టవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. అందుకే ముందుగా వాటి జాబితాను సిద్ధం చేస్తున్నారు. భారత దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన జాతులు ఉన్నట్లుగా కనుగొన్నామని, ముఖ్యంగా నదీ ప్రాంతాల్లో ఉన్న సీతాకోక చిలుకలు నీటి ఆరోగ్యాన్ని పెంపొందించేవిగా ఉన్నాయని సైంటిస్ట్ స్మెటాసెక్ చెప్తున్నారు.
నిజానికి అటవీశాఖ వారు అడవుల్లోని క్రిమి కీటకాలు, పక్షులు, ఇతర జాతుల వివరాలను సేకరించడం, వాటి లెక్కలను తెలపడంవల్ల నదీతీరాల్లోని అడవుల ఆరోగ్యం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందని సీతాకోక చిలుకల నిపుణులు అంటున్నారు. వాటి జన్మ స్థలాన్ని బట్టి అక్కడి పర్యావరణ సమాచారం ఆధారంగా జల భద్రతను నిర్థారించేందుకు, నదీ ప్రవాహం స్థిరీకరించేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్తున్నారు.
సీనాకోక చిలుకలు.. మొక్కల పరపరాగ సంపర్కానికి మాత్రమే కాక... కప్పలు, కందిరీగలు, పక్షులు, పలు రకాల కీటకాలకు, ఇతర జాతులకు ఆహారాన్ని అందించడంలోనూ ఉపయోగపడతాయట. స్వాతంత్ర్యానంతరం భారత దేశంలో ప్రత్యేకంగా ఓ సీతాకోక చిలుకల జాబితా తయారు చేశారు. ఆ తర్వాత పాకిస్తాన్, ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లో ఎటువంటి జాతులు ఉన్నాయనేది ఎవ్వరూ తెలుసుకోలేదు. ప్రస్తుతం ఇండియాలో సైంటిస్ట్ స్మెటాసెక్ తో పాటు, జూలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ ఆర్కే వర్స్ నే... అటువంటి సమాచారాన్ని తెలుసుకున్నారు. ఇండియాలోని కేరళ, కర్నాటక ప్రాంతాల్లో మాత్రమే వైవిధ్యంగా కనిపించే ట్రావెన్కోర్ ఈవెనింగ్ బ్రౌన్ సీతాకోకచిలుకలు ఉన్నాయని, అంతరించిపోతున్న ఇటువంటి జాతికి సమీపంగా కనిపించే కొన్ని జాతులు దక్షిణ ఆమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. రక్షిత ప్రాంతాల్లో ఇటువంటి జాతులు ఉండటం ఎంతో అదృష్టమని స్మెటాసెక్ తెలిపారు.