క్యాంపస్ ప్లేస్మెంట్లలో సీబీఐటీ రికార్డు
మొదటి దశలో 1,244 మందికి ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) క్యాంపస్ ప్లేస్మెంట్లో రికార్డు నెలకొల్పింది. సెప్టెంబర్లో జరిగిన మొదటి దశ క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఆ కాలేజీకి చెందిన 1,244 మంది విద్యార్థులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. వచ్చే ఏడాది ఇంజనీరింగ్ పూర్తి చేసుకోనున్న ఈ విద్యార్థులు రూ.3.25 లక్షల నుంచి రూ.7.5 లక్షల వార్షిక వేతనం పొందనున్నారు. '36 ఏళ్ల సీబీఐటీ ప్రస్థానంలో ఇన్ని ఉద్యోగాలు పొందడం ఇదే ప్రథమం. త్వరలో ప్రారంభం కానున్న రెండో దశలోనూ మా విద్యార్థులు ఉద్యోగాలు సాధిస్తారు. ఎన్నో దేశీయ, విదేశీ కంపెనీలు ప్లేస్మెంట్ల కోసం రానున్నాయి' అని సంస్థ ప్లేస్మెంట్ అధికారి ఎన్.ఎల్.ఎన్.రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మొదటి దశలో కాగ్నిజెంట్, యాక్సెంచర్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలతో పాటు ఒరాకిల్, జేపీ మోర్గాన్, డెలాయిట్, ఎకోలైట్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు తమ విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయని వివరించారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు సీబీఐటీ విద్యాసంస్థ అధ్యక్షుడు వి.మాలకొండారెడ్డి, ప్రిన్సిపల్ బి.చెన్నకేశవరావు అభినందనలు తెలిపారు.