ప్రజలను చైతన్యపరుస్తాం
– సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
– మూడోరోజుకు చేరిన పాదయాత్ర
ఊట్కూర్ : నారాయణపేట–కొడంగల్ ప్రాజెక్టు సాధించేందుకుగాను పాదయాత్ర ద్వారా ప్రజలను చైతన్యపరుస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. జలసాధన సమితి ఆధ్వర్యంలో మూడోరోజు ఆదివారం ఊట్కూర్ మండలంలోని బిజ్వార్ నుంచి పాదయాత్ర కొనసాగింది. పాతపల్లి, అవుసలోనిపల్లి, పెద్దజట్రం, నిడుగుర్తిలో ప్రజలు, రైతులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుతోనే మూడు నియోజకవర్గాలలోని పది మండలాల్లో సుమారు లక్ష ఎకరాలకు సాగు, తాగునీరు అందుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ నారాయణపేట డివిజన్ నుంచి వలసలు ఆగాలంటే ఈ ప్రాజెక్టు తప్పక చేపట్టాలన్నారు.
దీనిని ప్రస్తుత ప్రభుత్వం పక్కనబెట్టి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీరందిస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 69 జీఓను ఫేజ్–1గా, 72 జీఓను ఫేజ్–2గా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జలసాధన సమితి అధ్యక్షుడు అనంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ, గరిడి నింగిరెడ్డి; కాంగ్రెస్ నాయకుడు సరాఫ్ కష్ణ, సీపీఐ (ఎంఎల్) జిల్లా కార్యదర్శి కష్ణ, వివిధ పార్టీల నాయకులు గందే చంద్రకాంత్, సలీం, మాధవరెడ్డి, తిమ్మారెడ్డి, శేషప్ప, సత్యనారాయణరెడ్డి, అమ్మకోళ్ల శ్రీనివాస్, సాయిలుగౌడ్, హన్మంతు, నారాయణరెడ్డి, రాంరెడ్డి, సమరసింహారెడ్డి, యజ్ఞేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.