'సముద్రతీరం వెంబడి ప్రత్యేక నిఘా'
ఒంగోలు (ప్రకాశంజిల్లా): గుంటూరు పోలీస్ రేంజ్ పరిధిలో సముద్రతీరం వెంబడి నిఘా పెంచుతున్నట్లు గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ అన్నారు. నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఆయన ఒంగోలుకు గురువారం మొదటిసారి వచ్చారు. సర్కిళ్ల వారీగా శాంతిభద్రతల అంశం, నేరాలు, దొంగతనాలపై సమీక్షించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీసులతో పాటు జిల్లా పోలీసులు, రెవెన్యూ యంత్రాంగాన్ని సమన్వయపరిచి తీరం వెంబడి ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయనున్నట్లు.. త్వరలో కోస్ట్‌గార్డ్ పోలీసులతో మాక్‌డ్రిల్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం జరుగుతున్నందున అక్కడ మహిళా పోలీసుల అవసరం ఉందని చెప్పారు. మహిళా సిబ్బందిలో ధైర్యం నింపేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. సీసీఎస్ పోలీస్స్టేషన్లను ప్రత్యేక నేరాల వైపు దృష్టి సారించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
గుంటూరు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సీసీఎస్ పోలీస్స్టేషన్ల సిబ్బందిని సమన్వయపరిచి నేరాల అదుపునకు చొరవ చూపుతున్నట్లు పేర్కొన్నారు. మంత్రి శిద్దా రాఘవరావుపై ఎన్బీడబ్ల్యూ ఉన్నా ఇంత వరకు పోలీసులు చర్యలు చేపట్టలేదని విలేకరులు అడగ్గా...అలాంటి వాటిని ఎస్పీ పరిశీలిస్తారన్నారు. సమావేశంలో ఎస్పీ చిరువోలు శ్రీకాంత్, అదనపు ఎస్పీ బి.రామానాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.