నాస్తికోద్యమ నేత లవణం అస్తమయం
* శ్వాసకోస వ్యాధితో బాధపడుతూ కన్నుమూత
* అంతిమ కోరిక మేరకు నేత్రదానం
* ప్రముఖుల సంతాపం
సాక్షి, విజయవాడ/హైదరాబాద్: నాస్తికోద్యమ నేత, సంఘసంస్కర్త గోపరాజు లవణం (86) శుక్రవారం విజయవాడలో కన్నుమూశారు. కొద్ది రోజులుగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 9.50 గంటలకు తుది శ్వాస విడిచారు. ప్రముఖ సంఘసంస్కర్త, నాస్తికోద్యమ నిర్మాత గోపరాజు రామచంద్రరావు (గోరా), సరస్వతీ గోరాల ద్వితీయ కుమారుడైన లవణం తండ్రి నుంచి నాస్తికత్వం, సంఘసేవ అలవరుచుకున్నారు.
చారిత్రాత్మక ఉప్పు సత్యాగ్రహం జరిగే సమయంలో జన్మించడంతో గోరా తన కుమారుడికి ‘లవణం’ అని పేరు పెట్టారు. చిన్ననాటి నుంచే సంఘసేవలో పాల్గొని అస్పృశ్యత, మూఢనమ్మకాలు, జోగిని దురాచార నిర్మూలనకు, నేరస్తులను సంస్కరించేందుకు అవిశ్రాంత పోరాటం చేశారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిన్నారు. ముప్పైకి పైగా దేశాల్లో పర్యటించి నాస్తికోద్యమాన్ని ప్రచారం చేశారు. నాస్తిక వారపత్రిక సంఘం, ఆర్థిక సమత, నాస్తికమార్గం, హిందీ పత్రిక ఇన్సాన్, ఇంగ్లిష్ మాసపత్రిక ఎథియిస్ట్ నిర్వహణలో లవణం ప్రముఖ పాత్ర వహించారు.
భూదాన, సర్వోదయ ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1960లో మహాకవి జాషువా కుమార్తె హేమలతను వివాహం చేసుకున్నారు. 1962లో తలపెట్టిన ప్రపంచ శాంతియాత్రలో లవణం పాల్గొన్నారు. 1966-67లో అమెరికాలో శాంతి ఉద్యమంలోనూ, మార్టిన్ లూథర్ కింగ్ నాయకత్వాన పౌరహక్కుల ఉద్యమంలోనూ పాల్గొన్నారు. 1977 దివిసీమ ఉప్పెన సమయంలో సహాయ పునర్నిర్మాణ మహాసభలలో పాల్గొన్నారు. 2005లో నక్సలైట్ల సమస్య పరిష్కారానికి గట్టి కృషి సల్పారు.
2006లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్వర్ణో త్సవాల ముగింపు సభలో హింసలేని విప్లవం, అవినీతిలేని ప్రజాస్వామ్యం, ప్రజాప్రతినిధుల బాధ్యతపై ఆయన ప్రసంగించారు. ఆయన తన జీవితమంతా సమాజ పరివర్తనకు కృషి చేశారు. ఆయన కోరిక మేరకు కళ్లను స్వేచ్ఛా గోరా ఐ బ్యాంకుకు దానం చేశారు. భౌతికకాయాన్ని శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలకు అప్పగిస్తారు. లవణం భౌతికకాయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు.
కుటుంబ వివరాలు
గోరా తొమ్మిది మంది సంతానంలో లవణం రెండో వారు. లవణంకు సంతానం లేదు. సతీమణి హేమలత 2008లో కన్నుమూశారు. ప్రముఖ వైద్యుడు జి.సమరం, మాజీ ఎంపీ చెన్నుపాటి విద్యకు లవణం సోదరుడు.
లవణం మృతికి సీఎంల సంతాపం
గోపరాజు లవణం మృతికి తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. జోగినుల జీవితాలను మెరుగు పరిచేందుకు నిజామాబాద్ జిల్లాలో రెండు దశాబ్దాల క్రితం లవణం సతీమణి హేమలతతో కలసి పనిచేసిన అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలనకు సామాజిక కార్యకర్తగా లవణం చేసిన కృషిని ప్రస్తావించారు. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం కట్టుబడిన లవణం మృతి నాస్తికోద్యమానికే కాకుండా రాష్ట్రానికే తీరని లోటు అని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
వైఎస్ జగన్ సంతాపం
సంఘ సంస్కర్త డాక్టర్ లవణం మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. సమాజంలో బడుగుల అభ్యున్నతికీ, కుల వ్యవస్థ నిర్మూలనకూ లవణం చేసిన కృషిని కొనియాడారు.
వర్నిలో విషాదం
వర్ని(నిజామాబాద్): నాస్తికోద్యమ నేత గోపరాజు లవణం మృతితో నిజామాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలోని వర్ని ప్రాంతంతో ఆయనకు 30 ఏళ్ల అనుబంధం ఉంది. 1997లో వర్నికి చెందిన మార్ని రామకృష్ణారావు హేతువాద సభలకు వెళ్లినప్పుడు అక్కడ ఆయనకు లవణంతో పరిచయమైంది. వర్ని ప్రాంతంలో ప్రబలంగా ఉన్న చేతబడి, బాణామతి వంటి మూఢనమ్మకాల గురించి రామకృష్ణారావు ద్వారా తెలుసుకున్న లవణం దంపతులు ఈ ప్రాంతానికి వచ్చి ప్రజల్లో చైతన్యం కల్పించారు.
లవణం స్ఫూర్తితో వర్నిలో 1980లో నాస్తిక మిత్ర మండలి ఏర్పాటు చేశారు. జిల్లాలో జోగిని వ్యవస్థ దురాచారానికి ఎందరో మహిళలు బలవుతున్నారని గమనించి నాటి గవర్నర్ కుముద్ బిన్ జోషి, జిల్లా కలెక్టర్ ఆశామూర్తితో చర్చించి ఆ వ్యవస్థ నిర్మూలనకు కృషి చేశారు. అభాగ్యులైన మహిళల కోసం 1985లో ఇక్కడ ‘చెల్లి నిలయం’ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా జోగినులకు వివాహాలు జరిపించారు. ప్రజల ఆరోగ్య అవసరాల దృష్ట్యా 1997లో ప్రకృతి చికిత్సాలయూన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలందించారు. ఆయనతో కలసి పనిచేసిన కొందరు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు విజయవాడ వెళ్లారు.