ఇండస్ట్రియల్ కారిడార్‌గా తిరుపతి
రేణిగుంటలో సెల్కాన్ తయారీ యూనిట్‌కు సీఎం భూమిపూజ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: పరిశ్రమల ఏర్పాటుకు తిరుపతి అనుకూల ప్రాంతమని,జాతీయ రహదారుల సౌకర్యం ఉన్నందున తిరుపతి-చెన్నై -నెల్లూరు మధ్య తిరుపతి కేంద్రంగా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తిరుపతి-ఏర్పేడు ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ కారిడార్‌గా అభివృద్ధి చేస్తామన్నారు.
చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఐటీ పార్కులో రూ.150 కోట్లతో ఏర్పాటు చేస్తున్న సెల్కాన్ మొబైల్ తయారీ కంపెనీకి ముఖ్మమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం భూమి పూజ చేశారు. కంపెనీ ఆవరణలో మొక్కలు నాటి, నీరు పోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెంకటేశ్వర మొబైల్ యూనిట్లో మొదటి కంపెనీ సెల్కాన్ నిర్మాణ పనులు ప్రారంభం కావడం హర్షణీయమన్నారు. ఇండియాలోని బెస్ట్ కంపెనీల్లోఒకటైన సెల్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తిరుపతికి రావడం సంతోషమన్నారు.
దీని ద్వారా మొదటి దశలో ప్రత్యక్షంగా 20వేల మందికి, పరోక్షంగా 40 వేల మందికి ఉపాధి కలుగుతుందని పేర్కొన్నారు. సెల్కాన్ సీఎండీ వై.గురు కంపెనీ ప్రగతిని వివరించారు. సీఎండీ గురు, డెరైక్టర్లు పవన్, రాధాకృష్ణలను ముఖ్యమంత్రి సన్మానించారు.