‘సెల్’గాటం !
నకిలీ విడిభాగాలతో దోపిడీ
వినియోగదారులకు దుకాణదారుల శఠగోపం
{పధాన కంపెనీలను సైతం మోసగిస్తున్న వైనం
రిపేరుకు ఇస్తే విడిభాగాలు మాయం
చిత్తూరు : జిల్లావ్యాప్తంగా పలు సెల్ దుకాణాల యజమానులు ఇటు వినియోగదారులను, అటు సెల్ కంపెనీలను దోపిడీ చేస్తూ పెద్ద ఎత్తున దండుకుంటున్నారు. ముఖ్యంగా నాణ్యత లేని సెల్ డిస్ప్లేతో పాటు వివిధరకాల విభాగాలను వినియోగదారులకు అంటగడుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. అవగాహనలేమితో వినియోగదారులు నష్టపోతున్నారు. జీరో వ్యాపారాన్ని సాగిస్తూ అటు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. అడ్డగోలు సంపాదనే ధ్యేయంగా పలువురు సెల్షాపుల యజమానులు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. చిత్తూరుకు చెందిన ఓ సెల్ దుకాణం వారు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడి దొరికిపోయిన ఘటన సెల్ దుకాణాల అక్రమ వ్యాపారాలకు నిదర్శనం.
ఈ విషయాన్ని గుర్తించిన రెండు సెల్ కంపెనీల యజమానులు సెల్ షాపు యజమానిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. జిల్లావ్యాప్తంగా పలు సెల్షాపుల యజమానులు ఇదే పద్ధతిలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఒక్క చిత్తూరులోనే 58 సెల్షాపులుండగా, జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలోనే సెల్ దుకాణాలున్నాయి. వీటిలో ప్రధాన కంపెనీలతోపాటు వివిధ కంపెనీలకు చెందిన సెల్లను విక్రయిస్తున్నారు. సెల్ రిపేరుతో వినియోగదారులు షాపులకొస్తే చాలు వారి అక్రమాలు పురివిప్పుకుంటున్నాయి. కంపెనీ విడివిభాగాలను వేస్తామంటూ నమ్మబలికి నాసిరకం విడిభాగాలు వేసి పంపిస్తున్నారు. ప్రధాన కంపెనీకి చెందిన సెల్ అయితే విడిభాగాలను సైతం కాజేసి వాటి స్థానంలో నాసిరకం విడిభాగాలతో నింపి వినియోగదారులకు అంటగడుతున్నారు.
దీంతో పట్టుపని పది రోజులు కూడా సెల్లు పనిచేస్తున్న పరిస్థితి లేదు. ఇక వినియోగదారులకు నాసిరకం విడిభాగాలు అంటగట్టినా, కంపెనీ విడిభాగాలు వేసినట్లు రికార్డులు చూపి అటు సెల్ కంపెనీల వద్ద విడిభాగాలతో పాటు పెద్ద ఎత్తున కమీషన్లు గుంజుతున్నారు. మరోవైపు స్మగుల్ గూడ్స్ పార్టులతో జీరో వ్యాపారాన్ని సాగిస్తున్నారు. బిల్లులు లేకుండా అయితే ఒక్కొక్క ప్రధాన పార్టుపై రూ.1000 నుంచి 1500 వరకు తగ్గింపు ధరలు అని చెప్పి నాణ్యత లేని పార్టును వినియోగదారులకు అంటగడుతూ వినియోగదారులను మోసగించడమే గాక ప్రభుత్వ ఆదాయానికి గండిగొడుతున్నారు.
జిల్లావ్యాప్తంగా అధిక శాతం సెల్ దుకాణాలు ఇదే తీరులో అక్రమాలకు పాల్పడుతున్నారని ఓ సెల్ దుకాణ యజమాని ‘సాక్షి’కి వివరించారు. సెల్ వినియోగం ఇబ్బడిముబ్బడిగా పెరిగిన నేపథ్యంలో ఈ స్థాయి అక్రమాలను ప్రధాన సెల్ కంపెనీలు గుర్తించే పరిస్థితి తక్కువేనని ఆయన వివరించారు. ఒక్క నెలలోనే వందల డిస్ప్లేలు మార్చినట్లు రికార్డులు ఉండడంతోనే సెల్ దుకాణ యజమాని పట్టుబడే పరిస్థితి వచ్చిందని ఆయన తెలిపారు. ప్రధాన కంపెనీలు సైతం సెల్ దుకాణాల అక్రమాలపై దృష్టి పెట్టాలి. వీటితోపాటు అటు వాణిజ్య పన్నుల శాఖ, జిల్లా పోలీసుయంత్రాంగం సైతం సెల్ దుకాణాల అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది.