Cellphone manufacturing company
-
ఏపీలో మరో రెండు సెల్‌ఫోన్ యూనిట్లు
సాక్షి, అమరావతి: యాపిల్, రెడ్మీ వంటి ప్రముఖ బ్రాండ్ల సెల్ఫోన్లను తయారుచేసే తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ రాష్ట్రంలో మరో రెండు యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా ప్రస్తుతం శ్రీ సిటీలో ఉన్న యూనిట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతామని ఫాక్స్‌కాన్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ (ఇండియా) ఎండీ, కంట్రీ హెడ్ జోష్ ఫౌల్గర్ తెలిపారు. కోవిడ్ తర్వాత ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో అవకాశాలపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇన్వెస్ట్ ఇండియా ఈఐఎఫ్–2020 పేరిట నిర్వహించిన వెబ్‌నార్‌లో ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా జోష్ ఫౌల్గర్ మాట్లాడుతూ.. కోవిడ్ తర్వాత వచ్చే ఐదేళ్లలో దేశీయ ఎలక్ట్రానిక్ మార్కెట్ విలువ 400 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, ఈ అవకాశాన్ని రాష్ట్రం అందిపుచ్చుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌ను చాలా సమర్థవంతంగా కట్టడి చేసిందని, పారిశ్రామిక రంగం త్వరగా కోలుకునే విధంగా తక్షణ చర్యలు తీసుకుందని అభినందించారు. శ్రీ సిటీలోని ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించడానికి త్వరితగతిన అనుమతులు మంజూరు చేసిందని వెల్లడించారు. కాగా, ఏడాది పాలనలో భాగంగా పారిశ్రామిక రంగంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫౌల్గర్ మాట్లాడిన సంగతి తెలిసిందే. గతేడాది సెప్టెంబర్ 18న తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడతామని ఫౌల్గర్ హామీ ఇచ్చారు. -
ఫ్యాబ్ సిటీలో మైక్రోమ్యాక్స్
భూమి పూజ చేసిన ప్రతినిధులు - రూ.200 కోట్ల పెట్టుబడి; 500 మందికి ఉపాధి మహేశ్వరం : ప్రముఖ సెల్‌ఫోన్ తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్... తెలంగాణలో తన సెల్‌ఫోన్ తయారీ ప్లాంటుకు శుక్రవారం భూమి పూజ చేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాల, శ్రీనగర్ రెవెన్యూ పరిధిలో ఉన్న ఫ్యాబ్‌సిటీలో కంపెనీ ప్రతినిధులు భూమి పూజ నిర్వహించారు. ఈ ప్లాంటులో సెల్ ఫోన్లతో పాటు, ఎల్ఈడీ స్క్రీన్లను తయారు చేయనున్నట్లు వారు తెలియజేశారు. ఫ్యాబ్ సిటీలోని 19 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ కమర్షియల్ అధికారి రాకేష్ గుప్త చెప్పారు. త్వరలోనే ప్లాంటు నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. ‘‘ఈ ప్లాంటుపై రూ.200 కోట్లపెట్టుబడి పెడుతున్నాం. సుమారు 500 మందికి దీన్లో ఉపాధి దొరుకుతుంది’’ అని తెలియజేశారు. ప్రస్తుతం మైక్రోమ్యాక్స్‌కు దేశంలో ఒక ప్లాంట్ ఉందని, ఇది రెండో ప్లాంటు అవుతుందని చెప్పారాయన. మంచిరోజు కాబట్టి ఇపుడు భూమి పూజ చేశామని, త్వరలో మంత్రి, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులతో కలిసి అధికారికంగా శంకుస్థాపన చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో మైక్రోమ్యాక్స్ ఏజీఎం గజేందర్ కుమార్, ప్రాజెక్ట్ అధికారి ఆనంద్ ప్రకాష్, టీఐఐసీ అధికారి శ్యామ్‌సుందర్ తదితరులు పాల్గొన్నారు.