ఫ్యాబ్ సిటీలో మైక్రోమ్యాక్స్
భూమి పూజ చేసిన ప్రతినిధులు - రూ.200 కోట్ల పెట్టుబడి; 500 మందికి ఉపాధి
మహేశ్వరం : ప్రముఖ సెల్‌ఫోన్ తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్... తెలంగాణలో తన సెల్‌ఫోన్ తయారీ ప్లాంటుకు శుక్రవారం భూమి పూజ చేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాల, శ్రీనగర్ రెవెన్యూ పరిధిలో ఉన్న ఫ్యాబ్‌సిటీలో కంపెనీ ప్రతినిధులు భూమి పూజ నిర్వహించారు. ఈ ప్లాంటులో సెల్ ఫోన్లతో పాటు, ఎల్‌ఈడీ స్క్రీన్లను తయారు చేయనున్నట్లు వారు తెలియజేశారు. ఫ్యాబ్ సిటీలోని 19 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ కమర్షియల్ అధికారి రాకేష్ గుప్త చెప్పారు. త్వరలోనే ప్లాంటు నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు.
‘‘ఈ ప్లాంటుపై రూ.200 కోట్లపెట్టుబడి పెడుతున్నాం. సుమారు 500 మందికి దీన్లో ఉపాధి దొరుకుతుంది’’ అని తెలియజేశారు. ప్రస్తుతం మైక్రోమ్యాక్స్‌కు దేశంలో ఒక ప్లాంట్ ఉందని, ఇది రెండో ప్లాంటు అవుతుందని చెప్పారాయన. మంచిరోజు కాబట్టి ఇపుడు భూమి పూజ చేశామని, త్వరలో మంత్రి, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులతో కలిసి అధికారికంగా శంకుస్థాపన చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో మైక్రోమ్యాక్స్ ఏజీఎం గజేందర్ కుమార్, ప్రాజెక్ట్ అధికారి ఆనంద్ ప్రకాష్, టీఐఐసీ అధికారి శ్యామ్‌సుందర్ తదితరులు పాల్గొన్నారు.