మైనారిటీ గురుకులాలకు 500 కోట్లివ్వండి
కేంద్ర మైనారిటీ శాఖ మంత్రిని కోరిన ఈటల
- కేంద్ర మంత్రులతో ఈటల వరుస భేటీలు
- పీడీస్ రైస్ నిధులను విడుదల చేయాలని పాశ్వాన్‌కు విజ్ఞప్తి
- ఎన్సీడీసీ కింద రూ. 600 కోట్లు ఇవ్వాలని రాధామోహన్ సింగ్‌కు వినతి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో అదనంగా ఏర్పాటు చేయనున్న మైనారిటీ గురుకులాలకు రూ. 500 కోట్ల నిధులు కేటాయించాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి అబ్బాస్ నఖ్వీని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కోరారు. అలాగే రాష్ట్రం నుంచి హజ్ కోటాను కూడా పెంచాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీ పర్యటనకు వచ్చిన ఈటల వివిధ శాఖల మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. ముందుగా కేంద్ర మంత్రి అబ్బాస్ నఖ్వీతో సమావేశమై మైనారిటీల కోసం అమలు చేస్తున్న పథకాల అమలుకు కేంద్రం సాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి చేపడుతున్న వివిధ పథకాలపై సమావేశంలో చర్చించినట్టు తెలిపారు.
ఆయా పథకాల అమలుకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అభినందనీయమన్నారు. వీటి అమలుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. గురుకులాల నిర్మాణానికి సంబంధించి రూ. 140 కోట్లు విడుదల చేసిన ట్లు చెప్పారు. మంత్రి ఈటల ఆహ్వానం మేరకు ఈ పథకాల అమలు తీరును పరిశీలించడానికి త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తానని తెలిపారు. మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. గతంలో ఉన్న కేంద్రియ విద్యాలయాలకు ఏమాత్రం తీసిపోని విధంగా.. సీబీఎస్ఈ సిలబస్‌తో ఒక్కొక్క స్కూల్లో 400 నుంచి 600 మంది విద్యార్థులు విద్యనభ్యసించే విధంగా ఈ విద్యాసంవత్సరం నుంచే 71 మైనారిటీ గురకులాలను ఏర్పాటు చేశామన్నారు.
120 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా మిగిలినవి ఏర్పాటు చేయాల్సి ఉందని, దీనికి కేంద్ర సాయంగా రూ. 500 కోట్ల నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్టు ఈటల తెలిపారు. ప్రతి ఏడాది మైనారిటీ గురుకులాలకు నిర్వహణ ఖర్చుల కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,180 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వివరించారు. అందువల్ల మైనారిటీ గురుకులాల భవనాల నిర్మాణానికి కేంద్రం సాయం చేయాలని అబ్బాస్ నఖ్వీకి విజ్ఞప్తి చేశామన్నారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. స్వయంఉపాధి కోసం రూ. 10 లక్షల వరకు రుణాలు తీసుకుంటున్న మైనారిటీలకు 80 శాతం సబ్సిడీ ఇస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని ఈటల పేర్కొన్నారు. విదేశాల్లో చదవాలనుకొనే విద్యార్థులకు రూ. 20 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. అందువ ల్ల మైనారిటీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు కేంద్ర ప్రభుత్వం తగిన సాయం చేయాలని ఈటల కోరారు.
తగిన చర్యలు చేపట్టండి
ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతులకు రూ. 450 కోట్లు అవసరమవుతాయని, ఈ మేరకు నష్టం అంచనా నివేదిక ఇటీవలే కేంద్ర హోం శాఖమంత్రి రాజ్‌నాథ్‌కు సమర్పించామని.. ఈ నిధులను విడుదల చేయాలని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను కోరామన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఐటీనీ వరంగల్, కరీం నగర్‌లకు విస్తరించేందుకు కేంద్రం సాయం చేయాలని, కరీంగనర్‌లో ఇంక్యుబెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరగా తోమర్ సానుకూలంగా స్పందిం చారన్నారు. ఐసీడీఎస్ కేంద్రాలలో పిల్లలకు రోజు వారీ ఖర్చుల కింద ఇచ్చే డబ్బును రూ. 15కు పెంచాలని కేంద్ర మంత్రి మేనకా గాంధీని కలసి విజ్ఞప్తి చేశామని ఈటల తెలిపారు. తెలంగాణలో ఐసీడీఎస్ కేంద్రాలను అద్దె భవనాల్లో నడపాల్సిన పరిస్థితి ఉందని, ఐదు వేల ఐసీడీఎస్ భవనాల నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించాలని ఆమెను కోరామని చెప్పారు. దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పం దించారన్నారు. కేంద్ర మంత్రులను కలసిన వారిలో ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్ ఉన్నారు.
ఎన్సీడీసీ కింద రుణాలను పెంచండి..
తెలంగాణలో జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్సీడీసీ) కింద మహిళా సంఘాలకు మొదట రూ. 400 కోట్ల రుణా లివ్వాలని నిర్ణయిం చామని, దీనికి అదనంగా రూ. 600 కోట్లను విడుదల చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌ను కోరామన్నారు. తెలంగాణలో పౌల్ట్రీ ఇండస్ట్రీ కింద విద్యుత్ సబ్సిడీకి రూ. 100 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఈ పరిశ్రమ అభివృద్ధికి కేంద్రం తన వంతు సాయం చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. పాల ఉత్పత్తి రంగాన్ని, మేకలు, గొర్రెలకు సంబంధించి ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరామన్నారు.
పీడీఎస్ రైస్ నిధులను విడుదల చేయండి
కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్‌తో భేటీ అయిన ఈటల తెలంగాణకు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) రైస్ కింద రావాల్సిన రూ. 1,640 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. గురుకుల పాఠశాలలకు నిలయంగా ఉన్న తెలంగాణకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 6,400 మెట్రిక్ టన్నుల బియ్యానికి అదనంగా 2,400 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని ఈటల తెలిపారు.